కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో బీజేపీ, ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల కాషాయ నేతలు భగ్గుమంటున్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ దేశంతో పాటు దేశ ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీపై విద్వేష వ్యాఖ్యలు చేస్తారని, తాను దీన్ని ఖండిస్తున్నానని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే రాహుల్ వైఖరి ఆయన వ్యాఖ్యల్లో బయటపడిందని ఆరోపించారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ మనకు అందించిన రాజ్యాంగానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్ విదేశీ పర్యటనలో అర్ధరహిత, నిరాధార, తప్పుదారి పట్టించే అవాస్తవాలను పదేపదే వల్లెవేస్తున్నారని అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. భారత్‌లో సిక్కులను గురుద్వారల్లో తలపాగాలను ధరించనీయడం లేదని, తమ మతాచారాలను పాటించకుండా నిరోధిస్తున్నారని రాహుల్ చెప్పారని ఇది పూర్తిగా సత్యదూరమని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటున్నదని ప్రచారం చేశారని ఇది నిరాధార ఆరోపణని మంత్రి పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో చైనా సరిహద్దు విషయంలోనూ తప్పుదారిపట్టించే అవాస్తవాలను మాట్లాడారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణానికి బదులు అసత్యాల దుకాణం తెరిచారని ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం ఆయన మానుకోవాలని హితవు పలికారు. విపక్ష నేతగా రాహుల్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
Read More :
IIFA 2024 | హోస్ట్‌గా కాకుండా అప్పుడప్పుడు సినిమాలు తీయి.. కరణ్‌ను ఆటపట్టించిన షారుఖ్