Mahayuti | మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలోని మహాయుతి (Mahayuti) కూటమిలో చీలికలు వస్తున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన షిండే వర్గానికి బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్నట్లు మహారాష్ట్రలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఉన్నప్పటికీ ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ఇటీవలే ప్రత్యేకంగా ఓ వైద్య సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎలాంటి తగాదాలూ లేవని స్పష్టం చేశారు.
‘మా మధ్య ఎటువంటి ప్రచ్ఛన్న యుద్ధం లేదు (కోల్డ్ వార్). అభివృద్ధిని వ్యతిరేకించే వారిపై మేము ఐక్యంగా పోరాటం చేస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 31 అక్టోబర్ 2023న అప్పటి ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇలాంటి ఓ సెల్‌ను స్థాపించారు. తమ ప్రాంత ప్రజల కోసం దాని కార్యకలాపాలను పర్యవేక్షించే నా వ్యక్తులతో నేను ఓ కేంద్రాన్ని పునర్నిర్మించాను’ అని షిండే స్పష్టతనిచ్చారు. మరోవైపు ఈ వివాదంపై సీఎం ఫడ్నవీస్ కూడా స్పందించారు. ‘సచివాలయంలో ఏక్నాథ్ షిండే ఓ వైద్య సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదు. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటువంటి సెల్‌ను ఏర్పాటు చేశాను. ప్రజలకు సహాయం చేయడమే దాని లక్ష్యం. కాబట్టి అలాంటి సెల్‌ను సచివాలంలో ఏక్నాథ్ షిండే ఏర్పాటు చేశారు’ అని పేర్కొన్నారు.
కాగా, వైద్య సహాయ కేంద్రం ఏర్పాటుతోపాటు.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వీఐపీ భద్రతను ప్రభుత్వం తొలగించడంతో మహాయుతి కూటమిలో విభేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హోంశాఖ సీఎం ఫడ్నవీస్ వద్దే ఉంది. ఈ నేపథ్యంలో షిండే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు (Shiv Sena MLAs) ఉన్న వై కేటగిరి (Y category security) సెక్యూరిటీని హోంశాఖ ఉపసంహరించుకుంది. బీజేపీ, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కల్పించిన భద్రతను కూడా తగ్గించింది. అయితే, షిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని తెలిసింది. రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు అంశాలూ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Also Read..
Gyanesh Kumar | దేశ నిర్మాణంలో మొదటి అడుగు ఓటే.. సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్
PVR-INOX: మితిమీరిన యాడ్స్.. ఆలస్యంగా చిత్ర ప్రదర్శన.. పీవీఆర్ ఐనాక్స్కు భారీ జరిమానా
Cancer Vaccine | ఆరు నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా.. వెల్లడించిన కేంద్రం