Cancer Vaccine | ఛత్రపతి శంభాజీ నగర్, ఫిబ్రవరి 18 : దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ మంగళవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జరిగిన ఓ పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ టీకా పరిశోధన దాదాపుగా పూర్తయిందని.. ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 9-16 ఏండ్ల లోపు బాలికలు టీకా వేసుకోవడానికి అర్హులన్నారు.
‘దేశంలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపడుతున్నది. 30 ఏండ్ల పైబడిన మహిళలకు దవాఖానల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను నెలకొల్పుతాం’ అని ఆయన తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆయుష్ విభాగాలున్నాయని.. ప్రజలు వాటిని వైద్యం కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు.