Gyanesh Kumar | భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) మంగళవారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త సీఈసీగా జ్ఞనేశ్ కుమార్ ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటే అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడూ ఓటరుగా మారాలని పిలుపునిచ్చారు. ‘దేశ నిర్మాణంలో మొదటి అడుగు ఓటు వేయడమే. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలి. ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి’ అని అన్నారు.
#WATCH | Delhi: After taking charge, newly-appointed Chief Election Commissioner Gyanesh Kumar says, “First step for nation building is voting. Therefore, every citizen of India who has completed 18 years of age should become an elector and should always vote. In accordance with… pic.twitter.com/sSvZKSgN2Y
— ANI (@ANI) February 19, 2025
జ్ఞానేశ్ కుమార్.. కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏండ్లు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో ఆయన హోంమంత్రిత్వ శాఖలో (కశ్మీర్ డివిజన్) సేవలు అందించారు. 370 రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడైన జ్ఞానేశ్.. హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా గతేడాది జనవరి 31న రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు.
ఇక సీఈసీగా 2029 జనవరి 26వ తేదీ వరకూ కొనసాగనున్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే 2027లో జరుగుతాయి.
కాగా, ఇప్పటి వరకూ సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ పదవీ కాలం ఈనెల 18తో ముగియనుండటంతో అంతకంటే ఒక్కరోజు ముందు అంటే 17వ తేదీ సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమై జ్ఞానేశ్ కుమార్ పేరును ఖరారు చేశారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి పేరును ఖరారు చేశారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆయోదించారు. ఆ వెంటనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.
అయితే, సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ను, ఎన్నికల కమిషనర్‌గా (ఈసీ) వివేక్ జోషిని నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది. సీఈసీ ఎంపికకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నేడు విచారణకు వస్తుందనగా కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయ లబ్ధికోసమే అధికార బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తాజా చట్టం ప్రకారం కమిటీ తీసుకొనే ప్రతీ నిర్ణయంపై అధికార పక్షానిదే పైచేయిగా ఉంటుంది. ఇదే విపక్షాల ఆందోళనకు ప్రధాన కారణంగా మారింది. ఈ క్రమంలోనే కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం దీనిపై కోర్టు విచారణ జరుపనున్నది. ఈ సమయంలోనే సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్, ఈసీగా వివేక్ జోషిని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఖరారు చేసింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేవరకూ సీఈసీ ఎంపికను వాయిదా వేయాలంటూ రాహుల్ కమిటీ సభ్యులకు సూచించినా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తప్పించడం ద్వారా ఈసీపై ప్రభుత్వం నియంత్రణ కోరుకుంటున్నదనే విషయం స్పష్టమవుతున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈసీని బీజేపీ విభాగంగా మార్చే లక్ష్యం విజయవంతమైందని టీఎంసీ ఆరోపించింది. అమిత్ షాను నూతన సీఈసీగా సంబోధించింది. అయితే, కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నప్పుడు ఈసీఐను దుర్వినియోగం చేసిందని, విధేయులను సీఈసీ, ఈసీలుగా నియమించిందని బీజేపీ ఆరోపించింది. వారి సేవలు పొంది, పదవీ విరమణ తర్వాత వారికి పలు ప్రయోజనాలు కల్పించిందని పేర్కొన్నది.
సీఈసీ, ఈసీ నియామకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రాధాన్యత ప్రాతిపదికన బుధవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కూడిన ప్యానెల్ ద్వారా సీఈసీ, ఈసీల ఎంపిక, నియామకం జరగాలని 2023లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం సీజేఐని ప్యానెల్ నుంచి మినహాయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఓ ఎన్జీఓ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును అగౌరవపరుస్తూ ప్రభుత్వం 2023 చట్టం ప్రకారం సీఈసీ, ఈసీలను నియమించిందని, అత్యవసరంగా విచారించాల్సిన ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి జాబితాలో పైన ఉంచాలని ప్రశాంత భూషణ్ ధర్మాసనాన్ని అర్థించారు. దీనికి న్యాయమూర్తులు స్పందిస్తూ ఫిబ్రవరి 19న అత్యవసర కేసులను విచారించిన తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని న్యాయవాదులకు హామీ ఇచ్చారు.
దేశంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇద్దరు ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలను గతంలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి చేపట్టేవారు. అయితే, ఈసీల నియామకాలపై కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలంటూ సుప్రీంకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2023, మార్చి 2న వీటిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. సీఈసీ, ఈసీల నియామకాలను ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసులతో రాష్ట్రపతి నియమించాలని ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఐదు నెలల్లోనే బీజేపీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకాలు, సర్వీసుల నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023 పేరిట కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. సీఈసీ, ఈసీల నియామకాలను ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసులతో రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుంది. కమిటీలో సీజేఐను తప్పించి కేంద్రమంత్రిని చేర్చుతూ కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్న మాట.
Also Read..
Cumin Water | రోజూ ఉదయం, సాయంత్రం జీలకర్రను నానబెట్టిన నీళ్లను తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
KTR | రేవంత్ రెడ్డికి 4.20లక్షల కోట్ల జరిమానా వేసిన తప్పు లేదు.. కేటీఆర్ సెటైర్లు