Cumin Water | రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. కొందరు గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటారు. ఉదయం పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ టీ, కాఫీలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. కనుక ఉదయం పరగడుపున వీటిని తాగడం మానేయాలి. ఉదయం పరగడుపును నీళ్లను తాగలేని వారు జీలకర్రను నానబెట్టిన నీళ్లను తాగితే అనేక లాభాలను పొందవచ్చు. జీలకర్రను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇది ఒక పోపు దినుసుగా ఉపయోగపడుతుంది. అయితే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలోనే రాత్రంతా జీలకర్రను నానబెట్టిన నీళ్లను సేవిస్తుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ నీళ్లను రోజుకు 2 సార్లు తాగితే ఇంకా మంచిదని వారు అంటున్నారు. ఉదయం పరగడుపునే ఈ నీళ్లను తాగడంతోపాటు రాత్రి నిద్రకు ముందు కూడా తాగాలని వారు సూచిస్తున్నారు.
జీలకర్ర నీళ్లను రోజుకు 2 పూటలా తాగుతుంటే జీర్ణ సమస్యలు ఉండవు. ఈ నీళ్లను తాగడం వల్ల పలు జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్దకం సమస్యలను తగ్గిస్తాయి. ఉదయం పరగడుపునే ఈ నీళ్లను తాగుతుంటే జీర్ణవ్యవస్థ రోజంతా చురుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి ఆహారం తిన్నా సరే సులభంగా జీర్ణమవుతుంది. జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. దీంతో శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. కొవ్వు సులభంగా కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజుకు 2 సార్లు జీలకర్ర నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది.
జీలకర్ర నీళ్లను తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. రోజంతా బయట తిరిగే వారు ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు చేరకుండా ఉంటాయి. చర్మం సంరక్షించబడుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. జీలకర్ర నీళ్లను సేవించడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సులభంగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీళ్లు ఒక వరమనే చెప్పవచ్చు. ఈ నీళ్లను తాగడం వల్ల డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. జీలకర్ర నీళ్లను తాగితే జీర్ణాశయంలో యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. యాసిడ్లు మరీ ఎక్కువగా ఉత్పత్తి అవకుండా చూస్తాయి. దీంతో కడుపులో, గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర నీళ్లను రాత్రి నిద్రకు ముందు తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. మొటిమలతో బాధపడుతున్నవారికి ఈ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ నీళ్లను తాగుతుంటే వృద్ధాప్య చాయలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ఇలా జీలకర్ర నీళ్లను రోజుకు 2 సార్లు సేవించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.