బెంగుళూరు: బెంగుళూరులోని వినియోగదారుల కోర్టు.. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్(PVR-INOX) థియేటర్ ఓనర్లకు భారీ జరిమానా విధించింది. నిర్దేశిత సమయానికి చిత్రాన్ని ప్రదర్శించకుండా.. సుమారు 25 నిమిషాల పాటు యాడ్స్‌ను ప్రదర్శించారని, దాంతో తన విలువైన సమయం వృధా అయినట్లు ఓ సినీ ప్రేక్షకుడు దాఖలు చేసిన కేసులో కన్జ్యూమర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టికెట్‌పై ఉన్న స్క్రీనింగ్ టైంకే సినిమాను స్టార్ట్ చేయాలని, ఆలస్యం చేసినందుకు జరిమానా కట్టాలని వినియోగదారుల కోర్టు పేర్కొన్నది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి 2023 డిసెంబర్లో సినిమాకు వెళ్లాడు. సామ్ బహదూర్ చిత్రాన్ని చూసేందుకు మరో ఇద్దరితో కలిసి పీవీఆర్‌కు వెళ్లాడు. ఆ ఫిల్మ్ 4.05 నిమిషాలకు ప్రారంభమై.. 6.30 నిమిషాలకు పూర్తి కావాల్సి ఉంది. సినిమా ముగిసిన తర్వాత అతను మళ్లీ వర్క్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు చిత్రాన్ని 4.30 నిమిషాలకు ప్రారంభించారు. యాడ్స్, ట్రైలర్స్‌తో ఆలస్యం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సినిమా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో సినిమా పూర్తి కావడానికి కూడా మరింత సమయం పట్టింది. సినిమా ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయడం వల్ల తన అపాయింట్మెంట్ షెడ్యూల్‌ను మిస్సైనట్లు ఫిర్యాదులో ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
ఈ కేసులో ఫిబ్రవరి 15వ తేదీన కన్జ్యూమర్ కోర్టు ఆదేశాలు ఇస్తూ.. ఇతరుల సమయాన్ని వృధా చేస్తూ లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నది. 25 నుంచి 30 నిమిషాల పాటు థియేటర్లో ఖాళీగా కూర్చోవడం సరికాదు అని కోర్టు తెలిపింది. ఈ రోజుల్లో సమయాన్ని డబ్బుతో సమానమని, ఫిర్యాదుదారుడికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మానసిక వేదనకు గురైనందుకు అభిషేక్‌కు 20 వేల చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కోసం 10 వేలు చెల్లించాలని పీవీఆర్, ఐనాక్స్‌ను కోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాపార విధానాలను అవలంబిస్తున్నందుకు అదనంగా లక్ష నష్టపరిహారం చెల్లించాలని కన్జ్యూమర్ కోర్టు ఆదేశించింది.
పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్లో భాగంగా యాడ్స్, ట్రైలర్స్ స్క్రీనింగ్ చేసినట్లు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ పేర్కొన్నాయి. అయితే పీఎస్ఏకు సంబంధించిన స్క్రీనింగ్.. సినిమా నిర్దేశిత సమయాని కన్నా 10 నిమిషాల ముందు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. ఆదేశాలు జారీ చేసిన 30 రోజుల లోపు రూ.లక్ష కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.