Maharashtra CM | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఫలితాల్లో మహాయుతి (Mahayuti) కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మొత్తం 288 స్థానాలకు గానూ 220 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కూటమిలోని పెద్ద పార్టీ అయిన బీజేపీనే ఈ సారి సీఎం పదవి చేపడుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
కూటమిలో బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చాయి. మొత్తం 220 స్థానాల్లో బీజేపీ 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) బీజేపీ తరఫున మహా తదుపరి సీఎం అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఫడ్నవీస్ మద్దతుదారులు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు.
ఫడ్నవీసే మహా తదుపరి సీఎం..
మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఫడ్నవీసే బాధ్యతలు చేపడతారంటూ బీజేపీ నేత ప్రవీణ్ దకేకర్ కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహా తదుపరి సీఎంగా ఫడ్నవీసే ఖాయంగా తెలుస్తోంది. ఇదే విషయమైన ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పందించారు. కచ్చితంగా తన కుమారుడే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ 24 గంటలూ కష్టపడి పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తన కుమారుడు పెద్ద నాయకుడిగా ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు.
సీఎం ఎవరనేది కూర్చుని నిర్ణయిస్తాం : ఏక్నాథ్ షిండే
మరోవైపు ఏక్నాథ్ షిండే (Eknath Shinde)నే మహారాష్ట్ర తదుపరి సీఎం అని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అధికార కూటమికే మళ్లీ పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ సీఎం మీరే అవుతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. కూటమిలోని మూడు పార్టీల నేతలం కూర్చుని సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఈసారి పెద్ద పార్టీ అయిన బీజేపీ సీఎం పదవి చేపడుతుందా..? అని మీడియా ప్రశ్నించగా ‘కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలనే రూల్ ఏం లేదుగా..!’ అని షిండే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సీఎం సీటు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. గెలుపు సంతోషం కంటే కూటమికి నేతలకు సీఎం అభ్యర్థి ఎంపికే కష్టతరంగా మారబోతోందంటూ చర్చించుకుంటున్నారు.
ముంబైకి కేంద్ర పరిశీలకులు
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం రేపు ముంబైకి కేంద్ర పరిశీలకులను పంపనున్నట్లు తెలిసింది. వారు కూటమి పార్టీలతో చర్చలు జరపనున్నారు. కూటమిలోని మూడు పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈనెల 25న లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని (legislative party Meet) నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఆ తర్వాతి రోజు అంటే ఈనెల 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మహా అసెంబ్లీ గడువు ఈనెల 26తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలిచిన వాళ్లు 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
Also Read..
Sanjay Raut | ఇది ప్రజా తీర్పుకాదు.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Maharashtra Elections | మహా పీఠం మహాయుతిదే.. కూటమి నేతల సంబరాలు షురూ
Pawar vs Pawar | బాబాయ్‌పై అబ్బాయ్దే పైచేయి.. మహా రాజకీయాల్లో శరద్ పవార్ శకం ముగిసినట్లేనా?