న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లు నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానం అయ్యేందుకు అవకాశం కలిగించే కొత్త చిప్‌సెట్‌ను అభివృద్ధిపరచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాలో జరిగిన ఆల్-ఇన్ సదస్సులో మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు. తన కంపెనీలైన స్పేస్ఎక్స్, స్టార్‌లింక్ ఉమ్మడిగా ఈ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిప్సెట్ సిద్ధం కావడానికి సుమారు రెండేళ్లు పడుతుందన్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల యూజర్లు తమ ఫోన్లపై వీడియోలను స్ట్రీమ్ చేసుకోవచ్చునని, నిరంతరాయంగా డాటాను వాడుకోవచ్చునని చెప్పారు. ఈ నవ కల్పన వల్ల టెలికం ఇండస్ట్రీ రూపురేఖలు మారుతాయని అభిప్రాయపడ్డారు. ఈ చిప్సెట్ అందుబాటులోకి వస్తే, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు.
జియో లేదా ఎయిర్టెల్ వంటి లోకల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. భూమిపైగల ఏ భాగం నుంచి అయినా బీమ్ ఇంటర్నెట్ కవరేజ్ సాధ్యమయ్యేలా ఉపగ్రహం అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం స్టార్‌లింక్ కిట్‌లో స్టార్‌లింక్ డిష్, వైఫై రౌటర్, పవర్ సప్లయ్ కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటున్నాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే, డిష్‌ను ఆరుబయట అమర్చవలసి ఉంటుంది. స్టార్‌లింక్ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్లలో అందుబాటులో ఉంది. సెటప్ నుంచి మానిటరింగ్ వరకు ప్రతి విషయాన్నీ ఈ యాప్ నిర్వహిస్తుంది. మస్క్ చెప్పిన కొత్త చిప్ అందుబాటులోకి వస్తే, స్టార్‌లింక్ కిట్ అవసరం ఉండదు. ఫలితంగా ఎక్కడి నుంచి అయినా హైస్పీడ్ ఇంటర్నెట్ను వినియోగించుకుని వీడియోలను చూడవచ్చు, ఆటలు ఆడవచ్చు.