లండన్: గుండె పోటుకు కారణం కేవలం కొలెస్టరాల్, జీవన శైలి అంశాలు మాత్రమే కాదని, ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి..అని తెలిపే బలమైన ఆధారాలను ఫిన్లాండ్, బ్రిటన్ శాస్త్రవేత్తలు . రక్త నాళాల్లో కొవ్వు పదార్థాలు వంటివి గట్టిపడి, వాటిలోపల బ్యాక్టీరియా ఓ పొరను ఏర్పరచుకుంటుంది. ఇది గోప్యంగా అనేక దశాబ్దాలపాటు నిద్రాణ స్థితిలో ఉండగలదు. రోగ నిరోధక వ్యవస్థ నుంచి కూడా ఈ బ్యాక్టీరియా తనను తాను కాపాడుకోగలదు. వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా కానీ, ఇతర బాహ్య ప్రేరణల ద్వారా కానీ ఈ బ్యాక్టీరియా క్రియాశీలం అవుతుంది. అప్పుడు మంట రాజుకుంటుంది, రక్తనాళాలకు నష్టం కలిగించి, బిగుసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా గుండె పోటు సంభవిస్తుంది. ఇది అంటువ్యాధి కావచ్చునని మొట్టమొదటిసారి ఈ పరిశోధకులు చెప్తున్నారు.
ఈ పరిశోధన సంప్రదాయ రోగనిర్ధారణ పద్ధతులను సవాల్ చేస్తున్నది. హృదయ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్స, టీకాల అభివృద్ధి కోసం నూతన పరిశోధనలకు బాటలు వేస్తున్నది. ధమనులు బిగుసుకుపోయే వ్యాధిలో కొలెస్టరాల్‌తో కూడిన గడ్డలు బ్యాక్టీరియాతో ఏర్పడిన తడి జెల్లీ మాదిరిగా ఉండే బయో ఫిల్మ్‌కు ఆశ్రయం ఇస్తాయి. ఈ ప్రక్రియ కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని దశాబ్దాలపాటు జరుగుతుంది.
ఈ బయోఫిల్మ్ లోపలికి రోగి రోగ నిరోధక వ్యవస్థ కానీ, యాంటీబయాటిక్స్ కానీ చొచ్చుకెళ్లలేవు. కాబట్టి బయోఫిల్మ్ కింద ఉన్న బ్యాక్టీరియా సురక్షితంగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, వేరొక బాహ్య ప్రేరణ కానీ ఈ బయోఫిల్మ్‌ను క్రియాశీలం చేస్తుంది. ఫలితంగా బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది, విపరీతంగా ప్రతిస్పందిస్తుంది. గుండెకు రక్తం అందించే ధమనులలోని కొవ్వు గడ్డపై ఏర్పడిన రక్షణ కవచం పగిలిపోతుంది. రక్త గడ్డ ఏర్పడుతుంది. గుండెకు సరిగా రక్తం అందకపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతిని, గుండెపోటు సంభవిస్తుంది.
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ పెక్క కర్హునెన్ మాట్లాడుతూ, గుండె పోటు వ్యాధికి కారణం ఆక్సిడైజ్డ్ లో-డెన్సిటీ లిపోప్రొటీన్ మాత్రమేనని ఇప్పటి వరకు భావించారని తెలిపారు. ఈ వ్యాధికి కారణాల్లో బ్యాక్టీరియా కూడా ఉండవచ్చునని చాలా కాలం నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రత్యక్ష, నమ్మదగిన ఆధారాలు మాత్రం ఉండేవి కాదని తెలిపారు.
అనేక ఓరల్ బ్యాక్టీరియా నుంచి వచ్చిన డీఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ధమనులలో ఏర్పడిన కొవ్వు గడ్డల్లో ఉన్నట్లు తమ అధ్యయనం స్పష్టంగా వెల్లడించిందని తెలిపారు. ఈ అధ్యయనాన్ని టాంపెరె అండ్ ఔలు విశ్వవిద్యాలయాలు, ఫిన్నిష్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించాయి.