Earthquake | మయన్మార్‌ను (Myanmar) శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి.. థాయ్‌లాండ్, చైనాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతాతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, ఘాజియాబాద్, నోయిడా, మేఘాలయా, కోల్‌కతా, మణిపూర్‌లోని ఇంఫాల్‌లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మేఘాలయా ఈస్ట్ గారోహిల్స్‌లో 4.4 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోందో అన్న టెన్షన్‌తో ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
మయన్మార్‌లో రెండు భూకంపాలు..
మయన్మార్ (Myanmar)ను వరుస భూకంపాలు (Earthquake) వణికించాయి. శుక్రవారం ఉదయం రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సెంట్రల్ మయన్మార్ (Myanmar)లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. పలుచోట్లు ఎత్తైన అంతస్తులు నేలకూలినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్‌లోని మండలేలో గల ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది. ఇరావడీ నది (Irrawaddy River)లోకి వంతెన కూలిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
బ్యాంకాక్, చైనాలను వణికించిన భూకంపం
మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయ్‌లాండ్‌లో కూడా భూమి కంపించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎత్తైన భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది గల్లంతైనట్లు తెలిసింది. ఈ భూకంపంతో థాయ్‌లాండ్‌లో ఆదేశ ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టరు స్కేలుపై 7.9 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది.
Also Read..
Earthquake | మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు.. నేలకూలిన భవనాలు | Watch Video
PM Modi | థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఖరారు