న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. ఇరువురి సహాయక అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. (Shivakumar, Siddaramaiah aides clash) ఢిల్లీలోని కర్ణాటక భవన్లో వారిద్దరూ భౌతికంగా కొట్టుకునే పరిస్థితికి ఉద్రిక్తతలు దారి తీశాయి. అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, సీఎం సిద్ధరామయ్య స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (ఎస్డీవో) సీ మోహన్ కుమార్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎస్డీవో హెచ్ ఆంజనేయ మధ్య నెలకొన్న వివాదం తీవ్రమైంది. జూలై 22న కర్ణాటక భవన్లోని పరిపాలన బ్లాక్లో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో షూ తీసి కొడతానని మోహన్ కుమార్ తనను బెదిరించినట్లు ఆంజనేయ ఆరోపించారు. మిగతా అధికారుల ముందు తన పట్ల అసభ్యత, అవమానకరంగా ప్రవర్తించినట్లు విమర్శించారు.
కాగా, కర్ణాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ ఇమ్కాంగ్లా జమీర్, కర్ణాటక ప్రధాన కార్యదర్శి షాలిని రజనీష్కు ఆంజనేయ అధికారికంగా ఫిర్యాదు చేశారు. మోహన్ కుమార్ తనను వేధించడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విధులకు పదే పదే అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే దానికి మోహన్ కుమార్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కర్ణాటక ప్రధాన కార్యదర్శి రజనీష్ అధికారిక విచారణకు ఆదేశించారు. రెసిడెంట్ కమిషనర్ నుంచి నివేదిక కోరారు.
మరోవైపు డీకే శివకుమార్ ఎస్డీవో హెచ్ ఆంజనేయ తనపై చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఎస్డీవో సీ మోహన్ కుమార్ తిరస్కరించారు. క్రమశిక్షణారాహిత్యం, దుష్ప్రవర్తనకు ఆంజనేయ పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆంజనేయపై ఇతర సిబ్బంది చేసిన అనేక ఫిర్యాదులను మోహన్ కుమార్ ఉదాహరించారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో క్రమశిక్షణను అమలు చేసే ప్రయత్నంగా తన ప్రవర్తనను ఆయన సమర్థించుకున్నట్లు తెలిసింది.
Also Read:
Watch: వర్షాలకు తెగిన రోడ్డు.. మానవ వంతెన ద్వారా నీటిని దాటిన స్కూల్ విద్యార్థులు
Watch: చిన్నారిని షూ ర్యాక్పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వృద్ధురాలి పట్ల అమానుషం.. రాత్రివేళ రోడ్డు పక్కన పడేయడంతో మృతి