గజ్వేల్,మార్చి 9: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు రైతుల వెన్నువిరిచేలా ఉన్నాయని, రైతాంగానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు,రైతులతో కలిసి సోమవారం ఆయన ముట్టడించారు. అనంతరం డీఈ భానుప్రసాద్, ఏడీఈ జగదీశ్, ఏఈ మారుతిలకు కరెంట్ సమస్యను విన్నవించి లాగ్‌బుక్‌ను పరిశీలించి వినతిపత్రం అందజేశారు.
అనంతరం గజ్వేల్ మండలం అక్కారం పంప్‌హౌస్ వద్ద కొండపోచమ్మ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాట్లు ఆలస్యంగా వేయడంతో మరో రెండు నెలల పాటు ప్రభుత్వం రైతాంగానికి నిరంతరం కరెంట్ సరఫరా చేయాలని, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ కాలువల్లో సాగునీరు నింపాలని డిమాండ్ చేశారు. అధికారుల లెక్కల ప్రకారం 14గంటలపాటు సాగుకు కరెంట్ ఇస్తున్నామని చెబుతుండగా అందులో రెండు, మూడు గంటలు ఎల్సీ, ఇతర అవసరాల కోసం కట్ చేస్తున్నారన్నారు. నిరంతరంగా కరెంట్ ఇవ్వలేని పక్షంలో నియోజకవర్గంలోని 66సబ్స్టేషన్ల ఎదుట రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లో ఓల్టేజీ సమస్య రాకుండా చూడాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు.
కేసీఆర్ హయాంలో కాలువల్లో సాగుకు పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉంచారని, ఎర్రటి ఎండల్లో నీళ్లు పారించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇరిగేషన్ అధికారులు రైతులకు సరిపడా నీళ్లను కాలువల్లో పారించాలని, ఇక్కడి ఇరిగేషన్ కార్యాలయాన్ని కొడంగల్‌కు తరలించారని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు సరిపడా కరెంట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే పది రోజుల్లో కరెంట్ సరఫరా చేయకుంటే సాగుచేసిన వరి పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. 11గంటలకు మించి కరెంట్‌ను రైతాంగానికి సరఫరా చేయడం లేదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని గాలిలో వదిలేసిందన్నారు. “ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం” చరిత్రలో బాగుపడలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేండ్లలో ఐదు విడుతలుగా ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులను కేవలం మూడు విడతలు ఇచ్చి రెండు విడతలు ఎగ్గొట్టిందన్నారు. అందులో ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక విడతకు సంబంధించిన డబ్బులు జమచేసిందన్నారు. కొంతమందికే రైతుభరోసా వేసిందని వందశాతం ఎక్కడా ఇవ్వలేదన్నారు. రాబోయే పది రోజుల్లో రైతుభరోసా ఇవ్వకుంటే ఆర్డీవో కార్యాలయం ఎదుట వేలాది మంది రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశేట్టి చందన, రైతు బంధు సమితి రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ దేవీరవీందర్, కౌన్సిలర్లు రాజు, శ్రీధర్, మురళి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, నవాజ్‌మీరా, కుమార్, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, నర్సింగరావు, బయ్యారం శ్రీనివాస్‌రెడ్డి, పంగ మల్లేశం, మద్ధి రాజిరెడ్డి, సుగుణ, రవీందర్, గుంటుక రాజు, సురేశ్, ఉమార్ పాల్గొన్నారు.