Godavarikhani | కోల్ సిటీ: గోదావరిఖనిలో షాపింగ్ కాంప్లెక్స్ (Shopping Complex) వివాదాలు రగులుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ప్రధాన చౌరస్తాలోని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులను వెల్డింగ్ కార్మికులు అడ్డుకున్నారు. రామగుండం వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామోజు మహేశ్ ఆధ్వర్యంలో వెల్డింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన చేపట్టారు. సూపర్వైజర్, కార్మికుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. స్థానికుల పొట్టకొట్టడమే ప్రజాపాలన లక్ష్యమా అని మండిపడ్డారు. స్థానికంగా 50 ఏండ్ల నుంచి వెల్డింగ్ కార్మికులు మున్సిపాలిటీకి పన్నులు, కరెంటు బిల్లులు కడుతూ చాలీచాలని జీతాలతో జీవితాలను వెళ్లదీస్తున్నాం. అలాంటి తమకు జీవనోపాధి కల్పించాల్సిన ప్రజాప్రతినిధులు కరీంనగర్ నుంచి వెల్డింగ్ కార్మికులను తీసుకువచ్చి పనులు చేయించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
రామగుండంలో వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు (Development Works) చేస్తున్నామని పాలుకులు చెబుతున్నారే తప్ప, వీటిలో ఎంతమంది స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి బంధుగణాలకు ఈ పనులన్నీ అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. అదే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల పనులకు వెళ్తే అక్కడి ప్రజాప్రతినిధులు తమ పనిముట్లు బలవంతంగా లాక్కొని జరిమానాలు విధించి వెళ్లగొడతారని, అలాంటి కనీస బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధుల్లో లేకపోవడం విచారకరం అని పేర్కొన్నారు.
ఈ కాంప్లెక్స్ పనులు చేపట్టిన స్థానికేతరుడైన కాంట్రాక్టర్ ను అడిగితే వెల్డింగ్ పనులు ఉచితంగా చేస్తామంటే మీకే అప్పగిస్తామని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని, స్థానిక వెల్డింగ్ వర్కర్లను కాదని పనులు ఎలా చేపడతారో తేల్చుకుంటామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీల నాయకులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో వెల్డింగ్ అసోసియేషన్ కన్వీనర్ గరిమెల శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వడ్లూరి రాజు, సమ్మయ్య, గౌరవ అధ్యక్షులు డీవీ చారి, రామకృష్ణ, శివకృష్ణ, మల్లికార్జున్, చంద్రమౌళి పాల్గొన్నారు.