Devendra Fadnavis | మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే (Eknath Shinde), అజిత్ పవార్లు కూడా ప్రమాణం చేశారు. ఇక సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఫడ్నవీస్ తొలిసారి ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఏక్నాథ్ షిండే గురించి ప్రస్తావించారు.
ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం అనంతరం జరిగిన తొలి సమావేశంలోనే బీజేపీ నేత సీఎంగా ఉండేందుకు ఏక్నాథ్ షిండే అంగీకరించారని స్పష్టం చేశారు. అయితే, షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదని, మహాయుతి కూటమి ప్రభుత్వం సజావుగా సాగేందుకు నాయకత్వం వహిస్తే చాలని శివసేనలోని ఓ వర్గం భావించినట్లు చెప్పారు. అదే సమయంలో షిండేనే సీఎంగా ఉండాలని మరో వర్గం కోరుకున్నట్లు తెలిపారు. షిండేజీతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని ఫడ్నవీస్ తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందే ఆయనతో భేటీ అయినట్లు చెప్పారు. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం అంశాలపై చర్చించినట్లు వివరించారు. ఆ భేటీలోనే ఉపముఖ్యమంత్రిగా ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ వెల్లడించారు.
ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. కూటమిలోని బీజేపీకి 132 సీట్లతో అధిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ క్రమంలో సీఎం ఎవరన్నదానిపై కూటమి నేతలు తీవ్రంగా చర్చలు జరిపారు. ఫడ్నవీస్‌నే సీఎంగా చేయాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. అయితే, ఇన్నిరోజులూ సీఎంగా చేసిన షిండే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. దీంతో కూటమిలో విభేధాలు మొదలయ్యాయంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. వాటన్నింటికీ చెక్‌పెడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.
Also Read..
Farmers protest | రైతుల ఆందోళన ఉద్రిక్తం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు.. Video
Farmers protest | రైతుల ఆందోళన.. ఆ 10 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్