Farmers protest : రైతులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో రైతులు శంభు బార్డర్కు చేరుకుని ర్యాలీగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతుల ఆందోళనకు సంబంధించి ఎవరైనా పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ముందు జాగ్రత్త చర్యగా అంబాలా జిల్లాలోని 10 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయితే బ్యాంకింగ్, మొబైల్ రీచార్జ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ మేరకు టెలికామ్ ప్రొవైడర్లకు కూడా తగిన సూచనలు చేసింది.
కాగా వ్యవసాయ సంస్కరణల ద్వారా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబాలా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా వారు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. అయితే రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు పెద్ద ఎత్తున భారీకేడ్లను ఏర్పాటు చేశారు.