Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్య కోరల్లో (Air Pollution) అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా రాజధాని నగరంలో కాలుష్యం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. ఇవాళ కూడా గాలి నాణ్యత సూచిక తీవ్రస్థాయిలో నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 450 మార్క్‌ను దాటింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. సోమవారం ఉదయం అత్యధికంగా అశోక్ విహార్‌లో ఏక్యూఐ 500గా నమోదైంది. ఆనంద్ విహార్, అక్షర్‌దామ్ ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 493గా నమోదయ్యాయి. ద్వారకా ప్రాంతంలో 469, నోయిడాలో 454గా గాలి నాణ్యత సూచిక నమోదైంది.
రాత్రి ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇవాళ ఉదయం నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో దృశ్యమానత పడిపోయింది. కొన్ని మీటర్ల దూరంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పొగమంచు విమాన, రైలు రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport) కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర భారతంలో రైలు ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 60 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
Sinkholes | సింక్ హోల్స్‌తో తుర్కియేలో వ్యవసాయ సంక్షోభం.. ఏటికేడు పెరుగుతూ వస్తున్న ముప్పు
ISRO | మార్చిలోగా ఏడు ప్రయోగాలు.. సిద్ధమవుతున్న ఇస్రో