ఇస్తాంబుల్, డిసెంబర్ 14: తుర్కియేలో ప్రధాన ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన ప్రధాన గోధుమ ఉత్పత్తి ప్రాంతమైన కొన్యా మైదానం ఇప్పుడు తీవ్ర పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. తుర్కియేలోని మొత్తం వ్యవసాయ భూమిలో 11.2 శాతం (2.6 మిలియన్ హెక్టార్లు) ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో వందలాది సింక్హోల్స్ను (భారీ గోతులు) గుర్తించడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది జాతీయ ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భయపడుతున్నారు. తుర్కియే విపత్తుల నిర్వహణ సంస్థ ఏఎఫ్ఏడీ అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో 684 సింక్హోల్స్ను అధికారికంగా గుర్తించారు.
భూమి ఆకస్మికంగా కుంగిపోవడం వల్ల ఏర్పడే భారీ గుంతలనే సింక్‌హోల్స్ అంటారు. కొన్యాలోని సింక్ హోల్ రిసెర్చ్ సెంటర్ విడుదల చేసిన డాటా ప్రకారం 2017లో సింక్ హోల్స్ సంఖ్య 299 ఉండగా, అది 2021 నాటికి 2,550కు చేరింది. ఒక్క 2025లోనే 20 భారీ సింక్హోల్స్ను గుర్తించారు. వీటిలో కొన్ని 30 మీటర్ల లోతు, 100 అడుగుల వెడల్పును కలిగి ఉన్నాయి. ఈ విపత్తు ఆకస్మికంగా ఏర్పడినది కాదని, అయితే గత 20 ఏండ్లుగా ఈ సమస్య తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడటం, కరవు తీవ్రత పెరగడం వల్ల 2025లో ఈ పరిస్థితి మరింత జటిలంగా మారిందని పేర్కొన్నారు.