Air India | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, మరో బీజేపీ నేత ఎయిర్ ఇండియాపై మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 82 ఏళ్ల వృద్ధురాలికి ఎయిర్ ఇండియా సిబ్బంది వీల్‌ఛైర్ (Wheelchair) నిరాకరించారు. దీంతో ఆ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లి కిందపడిపోయి తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు. ఈ విషయాన్ని బాధితురాలి మనవరాలు మనవరాలు పరుల్ కన్వర్ (Parul Kanwar) తెలిపారు.
ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఎయిర్ ఇండియా (Air India)పై ఆరోపణలు చేశారు. తన అమ్మమ్మ రాజ్ పప్రిచాతో కలిసి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నట్లు చెప్పారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే వీల్‌ఛైర్‌ను కూడా బుక్ చేసుకున్నట్లు తెలిపారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌ఛైర్ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించినట్లు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక.. కౌంటర్ వరకూ అతికష్టం మీద నడుచుకుంటూనే వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో తన అమ్మమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని.. తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. అక్కడే ఉన్న సిబ్బంది ఇదంతా చూస్తున్నా కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు వీల్ ఛైర్ రావడంతో సిబ్బంది తన అమ్మమ్మ ఆరోగ్యాన్ని కూడా చెక్ చేయకుండానే విమానం ఎక్కించి పంపించేశారని అన్నారు. పెదవి నుంచి రక్తం వస్తోందని, తల, ముక్కుకు కూడా గాయంతోనే బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్లు చెప్పారు. గత రెండు రోజులుగా ఆమెకు ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారని, ఆమె ఎడవైపు క్రమంగా బలహీనంగా మారుతోందని చెప్పారు. ఇక ఈ ఘటనపై ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఘటనపై పూర్తి వివరాలు అందించాలని పరుల్‌ను కోరింది.
Also Read..
International Womens Day: వుమెన్స్ డే స్పెషల్.. మహిళా సిబ్బందితో వందేభారత్ రైలు.. వీడియో
Lalit Patidar | ముఖమంతా జుట్టుతో గిన్నిస్ రికార్డ్.. ప్రతి సెంటీ మీటర్‌కు 201.72 వెంట్రుకలు
Tariffs | అమెరికా టారిఫ్‌లపై రాజీ మార్గమే.. ఇతర దేశాల కంటే భిన్నంగా భారత్ తీరు