న్యూఢిల్లీ, మార్చి 7: భారత్‌పై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండటంతో ఆ ప్రభావాన్ని నివారించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై విధాన నిర్ణేతలు, వ్యాపారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అమెరికా నుంచి భారత్‌కు జరిగే కీలక దిగుమతులపై సుంకాలను తగ్గించాలని ప్రభుత్వ యోచిస్తున్నట్టు, వివిధ రంగాల కంపెనీలు తమ వ్యాపారం సజావుగా కొనసాగేలా చూసుకునేందుకు అమెరికన్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలకు సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ఘర్షణాత్మక వాతావరణంలో భారత్ ప్రతీకార చర్యలకు దిగకుండా రాజీ ధోరణిని అవలంబిస్తోందని, అమెరికాతో చురుకైన వాణిజ్య చర్చలు, దౌత్య సంప్రదింపులు జరుపుతూ ఇతర దేశాలకు భిన్నంగా వ్యవహరిస్తోందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘ఎస్ సెక్యూరిటీస్’ తెలిపింది. సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ రాజీ విధానాన్ని అనుసరించడం భారత్‌ను ప్రత్యేక స్థానంలో నిలిపిందని, వాణిజ్య చర్చలను కొనసాగించడం, సుంకాలను హేతుబద్ధీకరించడం ట్రంప్ సర్కారును శాంతింపజేయవచ్చని అభిప్రాయపడింది.
ఘర్షణ వీడి కలసి నడుద్దాం
భారత్-చైనా సంబంధాలు మరింత బలపడాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ శుక్రవారం ఆకాంక్షించారు. తూర్పు లద్దాఖ్‌లో సైనిక ప్రతిష్టంభన ముగిసిన తర్వాత ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో సానుకూల పురోగతి కనపడుతోందని అన్నారు. పరస్పరం తూలనాడుకోవడం లేదా ఘర్షణపడడం మాని ఒకరికొకరం మద్దతు ఇచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. డ్రాగన్, ఏనుగు మధ్య సహకారం ఉభయ దేశాలకు ప్రయోజనకరమని అన్నారు.