IndiGo | దేశంలో విమానయానం ఆగమాగం అవుతోంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ప్రయాణికును తీవ్ర అవస్థల పాలు చేస్తోంది. గత మూడు రోజులుగా ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కలుగుతోన్న విషయం తెలిసిందే. రోజూ వందలాది విమానాలు రద్దవుతున్నాయి. ఇవాళ కూడా దాదాపు 500 విమానాలు రద్దయ్యాయి. అంతేకాదు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌నుంచి వెళ్లే అన్ని దేశీయ విమానాలు ఇవాళ అర్ధరాత్రి వరకూ రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
మరోవైపు ఇండిగోలో నెలకొన్న సంక్షోభంతో విమాన టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. దీంతో ప్రయాణికుల విమాన ప్రయాణం మరింత భారంగా మారింది. ఇవాళ ఢిల్లీ-ముంబై, ముంబై-ఢిల్లీ మార్గంలో విమాన టికెట్ ధర ఏకంగా రూ.60 వేలుగా (రౌండ్ ట్రిప్) ఉంది. అదే వన్‌వే అయితే రూ.35,000గా చూపిస్తోంది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇది ఒకటి. దీంతో విమాన టికెట్ ధరలను విమానయాన సంస్థలు భారీగా పెంచాయి.
ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై సహా ఇతర నగరాలకు విమాన సర్వీసుల టికెట్ ధరలు కనిష్ఠంగా రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నాయి. సాధారణ సమయాల్లో రూ.6-10 వేల మధ్య ఉండే ధరలు ఇంత భారీగా పెరగడంతో అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విదేశాలకు వెళ్లే విమానాలకు కూడా ఇంత టికెట్ ధర ఉండదంటూ వాపోతున్నారు. కొందరు ప్రయాణికుల తమ గమ్య స్థానాలకు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read..
Rahul Gandhi | ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. ఇండిగో వైఫల్యంపై రాహుల్
IndiGo | వరుసగా నాలుగోరోజూ.. 400కిపైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు