హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల నియామకాల్లో జాప్యంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 733 పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) 2024 నవంబర్ 30న సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించింది. డిసెంబర్ 3న ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. మే 12న ఫైనల్ కీ, ఫలితాలు వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేయకపోవడంతో పరీక్షలు రాసిన 25 వేల మంది అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ పోస్టుల్లో డీహెచ్, డీఎంఈ పరిధిలో 446, టీవీవీపీ పరిధిలో 185, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో 2 పోస్టులు కలిపి మొత్తం 633 ఖాళీలకు తొలుత నోటిఫికేషన్ ఇవ్వగా వీటి సంఖ్యను తర్వాత 733కు పెంచారు.
సీబీటీ ద్వారా 80 పాయింట్స్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 20 పాయింట్లను సర్వీస్ వెయిటేజీ కింద ఇస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొన్నది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలలకు 2 మార్కులు చొప్పున ఎన్ని రోజులు సర్వీస్ చేస్తే అన్ని మార్కులు కేటాయించనున్నారు. సర్వీస్ చేస్తూనే కొంత మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సర్టిఫికెట్లను మెడికల్ షాపులకు అద్దెకు ఇచ్చుకున్నారని ఫ్రెషర్ అభ్యర్థులు హై కోర్టును ఆశ్రయించారు.
దీంతో పని చేసుకుంటూ సర్టిఫికెట్లను అద్దెకు ఇచ్చిన అంశంలో వెరిఫికేషన్ బాధ్యతలను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ)కు అప్పగించారు. డీసీఏ రిపోర్టును తయారు చేసి బోర్డు సెక్రటరీకి పంపింది. న్యాయ సలహ కోసం బోర్డు సెక్రటరీ ఏజీకి పంపారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని పలుమార్లు ప్రజావాణి, హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోతున్నారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న సమయంలో 3 నుంచి 6 నెలల వరకు తమకు జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు సర్టిఫికెట్లు అద్దెకు ఇచ్చారనే కారణంతో తమకు శిక్ష వేస్తే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు. 20ఏండ్లకు పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌లో సేవలు అందిస్తున్నామని, కేవలం 12వేల నుంచి 18 వేల వేతనంతో పని చేసినట్టు వివరించారు. ఇందులో సైతం ఏజెన్సీలు పెద్ద మొత్తంలో కోత విధించి తమ చేతికి జీతాలు ఇచ్చేవారని వాపోతున్నారు. సర్టిఫికెట్లు అద్దెకు ఇవ్వకూడదని నోటిఫికేషన్లో సైతం లేదని, కొంత మంది చేసిన తప్పుకు అందరికీ శిక్ష విధిస్తే ఎలా..? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఫార్మాసిస్టు గ్రేడ్-2 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.