హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : దేశంలో తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ తాటి చెట్టు(పామ్) బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న నీరా పాలసీ తరహాలో దేశవ్యాప్తంగా ఈ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తాటి, ఈత, జీలగా, ఖర్జూర వంటి పామ్ చెట్ల ద్వారా బెల్లం, చకెర, సిరప్ వంటి ఆహార ఉత్పత్తులతోపాటు గృహ అలంకరణ వస్తువులు తయారు చేసి అనేక దేశాలు మంచి ఆదాయం పొందుతున్నాయని గుర్తుచేశారు. మన దేశంలో కూడా ఇలాంటివి కోట్లలో ఉన్నాయి అని, వాటి ఉత్పత్తులను ప్రోత్సహించి సరైన మారెటింగ్ కల్పిస్తే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు.
పామ్ ఉత్పత్తులతో తయారయ్యే బెల్లం, చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివని, ముఖ్యంగా షుగర్ రోగులకు కూడా అవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. రసాయన కూల్ డ్రింకుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, సహజ సిద్ధమైన పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన డ్రింకులు అందించవచ్చని సూచించారు.
పామ్ చెట్ల నుంచి తయారయ్యే ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని, దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని శ్రీనివాసగౌడ్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో కర్ణాటక మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, లోక్సభ మాజీ సభ్యుడు ఉమేశ్ జాదవ్, జేడీఎస్ నాయకులు బాల్రాజ్ గుత్తేదార్, వీకే గౌడ, ఆల్ ఇండియా గౌడ ప్రతినిధి జీకే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.