హుస్నాబాద్‌టౌన్, మార్చి 18: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కష్టాల్లో పడ్డారు. కూపన్ల ద్వారా ఇసుక అందిస్తామని ప్రభు త్వం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులే ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితి నెలకొని ఆరురోజులు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.సాక్షాత్తు మంత్రి పొ న్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేం ద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి..
ఇసుకకు అధికారులే బ్రేక్…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 540 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. ఇందులో దాదాపు 340కిపైగా ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రభుత్వం ఒక ఇంటికి ఎనిమిది కూపన్లు అందజేస్తున్నది. ఈ కూపన్లద్వారా ఇండ్లకు సరిపడా ఇసుక తీసుకువచ్చి నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉంది. అయితే మంజూరు చేసిన ఇండ్లలో కేవలం ఇరువైలోపు మాత్రమే ఇప్పటి వరకు పూర్తిచేయగా ఇంకా 90శాతానికిపైగా ఇండ్లు పూర్తికావాల్సి ఉంది. దీనికి ప్రధానంగా అవసరమైన ఇసుకను కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం రామంచ, ఇందుర్తి గ్రామాల నుంచి హుస్నాబాద్‌కు సరఫరా చేసేవిధంగా అధికారులు కూపన్లు మంజూరు చేశారు. కొంతకాలంగా సవ్యంగా సాగిన ఈ సరఫరా ఐదు రోజుల నుంచి నిలిచిపోయిం ది. సవ్యంగా ఇసుక సరఫరా చేస్తే చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రెవెన్యూ, పోలీస్ అధికారులే ట్రాక్టర్ల యజమానులను హెచ్చరించారు. దీంతో ఇసుక సరఫరా నిలిపివేయడంతో ఇసుక రాక ఇండ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఇసుక కూపన్ల నిలిపివేత
ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నా యి. ఇండ్ల లబ్ధిదారులు ఇసుక కోసం మున్సిపల్ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుక తెచ్చుకునేందుకు కూపన్లు ఇవ్వాలని కోరితే ఆన్లైన్ కావడం లేదని తిరకాసు పెడుతున్నారు. ఇసుక తరలింపునకు ఎదురవుతున్న అడ్డంకులు దృష్టిలో పెట్టుకుని కూపన్లు ఇవ్వడం లేదని, మరోవైపు అధికారులు సమాధానమిస్తున్నారు. దీంతో పట్టణంలో ఇసుక సరఫరా లేక ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయి లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి చొరవ తీసుకుని ఇసుక సమస్య పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.