కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత బౌలింగ్ విభాగానికి ఊహించని సవాల్ ఎదురైంది. కొలంబోలోని ఎన్సిసి మైదానంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో శుక్రవారం మొదలైన మూడో రోజుల వామప్ మ్యాచ్‌లో తొలి రోజు మన పేసర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆతిథ్య జట్టులోని అనామక బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. స్పిన్నర్లు ఓమోస్తరుగానే రాణించడంతో ఫస్ట్ డే లంకదే పైచేయి అయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన లంక ఎలెవన్ 90 ఓవర్లలో 363/8 స్కోరుతో తొలి రోజును ముగించింది. లంక బ్యాటర్లలో రవిందు రసంత (143 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 71), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 66), కెప్టెన్ సోనల్ దినుష (52) అర్ధ శతకాలతో రాణించారు. తొలి రెండు సెషన్లలో నిరాశపరిచిన బౌలర్లు ఆఖర్లో కాస్త పుంజుకున్నారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (2/76), రవీంద్ర జడేజా (2/64), మానవ్ సుతార్ (2/33) తలో రెండు వికెట్లు తీశారు. కాగా, ప్రాక్టీస్ సెషన్లో దెబ్బతగలడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. దాంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫస్ట్ క్లాస్ హోదా లేని ఈ పోరులో భారత్ రెండో రోజు 90 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయనుంది. మూడో రోజు ఇరు జట్లు చెరో 45 బ్యాటింగ్ చేస్తాయి.
సిరాజ్, ప్రసిద్ధ్ పేలవంగా..
దాదాపు ఐదు వారాల విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత పేసర్లు లయ తప్పడం, ఆరంభంలో స్పిన్నర్లు కూడా పరుగులు సమర్పించుకోవడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్‌ను ఆందోళనకు గురిచేసింది. బుమ్రా గైర్హాజరీలో పేస్ విభాగాన్ని నడిపించే హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తను 13 ఓవర్లలో (0/ 44) ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, ప్రసిద్ధ్ కృష్ణ (8 ఓవర్లలో 0/ 32) కూడా ఫెయిలయ్యాడు. యువ పేసర్ గుర్నూర్ బ్రార్ (1/49) కొంత ప్రభావం చూపి ఓ వికెట్ దక్కించుకోగలిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక కుర్రాళ్లు తొలి రెండు సెషన్లలో భారత బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో ధాటిగా ఆడగా, మరో ఓపెనర్ రవిందు నిలకడ చూపెట్టాడు. సిరాజ్, ప్రసిద్ధ్‌ను సునాయాసంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దురదృష్టవశాత్తూ ఫెర్నాండో రనౌట్ కావడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దినుష అద్భుతమైన టెక్నిక్‌తో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ మణికట్టును పక్కాగా చదివిన దినుష అతని బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడు. మరోవైపు రమేష్ మెండిస్ (32) వేగంగా పరుగులు సాధించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు.
స్పిన్నర్లు ఓకే..
తొలి రెండు సెషన్లలో లంక బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఆఖరి సెషన్లో భారత స్పిన్నర్లు పుంజుకుని వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ తన తొలి స్పెల్‌లో 5 ఓవర్లలోనే 29 పరుగులు సమర్పించకున్నా.. తర్వాత బంతి వేగంలో మార్పులు చేస్తూ ఫలితం రాబట్టాడు. విక్రమసంఘే (31), బండార (13)ను ఔట్ చేశాడు. మరోవైపు సీనియర్ ఆల్ రౌండర్ జడేజా కూడా ఆరంభంలో ఇబ్బంది పడ్డా ఆ తర్వాత కంట్రోల్ సాధించి పసిందు (35), రమేశ్ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన రవిందు, దినుషను ఔట్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ, తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సారాంశ్ జైన్ (0/54) తేలిపోయాడు. ఏదేమైనా ఇప్పటికే గాయాల సమస్యలతో సతమతమవుతున్న టీమిండియాకు ఈ నాన్-ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సీనియర్ పేసర్లు వికెట్లు తీయలేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది.
గిల్ చేతి వేలికి గాయం
గాయంతో ఇప్పటికే బుమ్రా సిరీస్‌కు దూరం అవ్వగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూ డా వామప్ మ్యాచ్ తొలి రోజు గ్రౌండ్లోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.గురువారం జరిగిన ప్రాక్టీస్‌లో గిల్ కుడిచేతి ఉంగరపు వేలికి దెబ్బ తగిలినట్లు బీసీసీఐ తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగానే వామప్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడని వెల్లడించింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ గిల్ కోలుకుంటున్న తీరును నిశితంగా గమనిస్తోందని చెప్పింది. కానీ, గాయం తీవ్రత ఎంత అనే విషయం వెల్లడించలేదు.
రెండు టెస్టుల్లో ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
భారత్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లను వీక్షించేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ 15న గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదలవనుండగా.. రెండో పోరు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరగనుంది.