న్యూయార్క్: పురుషుల టెన్నిస్‌లో ఈ ఏడాది అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్, అమెరికా యువ సంచలనం బెన్ షెల్టన్ యూఎస్ ఓపెన్ సింగిల్స్‌లో ఫైనల్ చేరుకున్నారు. టాప్ సీడ్ జ్వెరెవ్ ఈ సీజన్లో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్లో అడుగుపెట్టగా.. సంచలన ఆటతో అబ్బురపరుస్తున్న షెల్టన్ తొలిసారి ఓ మేజర్ టోర్నీ తుదిపోరుకు అర్హత సాధించాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది.
శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ జ్వెరెవ్ 6-3, 7-6 (9/7), 7-6 (8/6)తో కారెన్ ఖచనోవ్ (రష్యా)ను చిత్తు చేశాడు. ఈ పోరులో జ్వెరెవ్ బలమైన సర్వీస్‌లు, పదునైన ఏస్‌లతో అదరగొట్టాడు. ఎనిమిదో గేమ్‌లో ఖచనోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 37 నిమిషాల్లోనే తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్ ఆరంభంలోనే బ్రేక్ సాధించిన టాప్ సీడ్ ఆటగాడు వెంటనే డబుల్ ఫాల్ట్ చేసి సర్వీస్ చేజార్చుకున్నాడు. దాంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. ఈ సీజన్లో 25-12 టైబ్రేకర్ రికార్డు ఉన్న జ్వెరెవ్ 22 షాట్ల లాంగ్ ర్యాలీ తర్వాత మూడో సెట్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకుని ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. రెండో సెట్లోనే జ్వెరెవ్ 7 ఏస్‌లు బాదాడు.
మ్యాచ్‌లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మూడో సెట్లో ఖచనోవ్ పూర్తి ఎటాకింగ్ గేమ్ ఆడాడు. మరోవైపు టాప్ సీడ్ ఆటగాడు ఏమాత్రం వెనక్కుతగ్గకపోవడంతో ఇది కూడా టై బ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో ఖచనోవ్ 3-0, 5-2తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ, 6-4 వద్ద రెండు సెట్ పాయింట్లు లభించినప్పటికీ ఖచనోవ్ ఒక్క పాయింట్ కూడా గెలవలేకపోయాడు. మరోవైపు తన అనుభవాన్ని రంగరించి ఆడిన జ్వెరెవ్ వరుసగా పాయింట్లు సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయిన జ్వెరెవ్, ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. షెల్టన్‌తో ముఖాముఖీలో జ్వెరెవ్ 5-0తో ఆధిక్యంలో ఉండటం విశేషంషెల్టన్ దూకుడు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాస్‌ను ఓడించిన జోరును కొనసాగించిన 8వ సీడ్ షెల్టన్ ఆల్-అమెరికన్ సెమీఫైనల్ పోరులో 4-6, 6-3, 6-3, 7-5 తో తోటి ఆటగాడు, 11వ సీడ్ ఫ్రాన్సిస్ తియఫోకు చెక్ పెట్టాడు. 14 అనవసర తప్పిదాలు చేసి తొలి సెట్‌ను కోల్పోయినా రెండో సెట్ నుంచి షెల్టన్ తన ప్రధాన ఆయుధమైన పవర్ఫుల్ సర్వీస్‌లతో విరుచుకుపడ్డాడు.
మ్యాచ్ మొత్తంలో ఏకంగా 20 ఏస్‌లు బాదాడు. రెండో సెట్లో 3-3 వద్ద 125 మైళ్ల వేగంతో వేసిన సర్వ్‌తో తియఫోను వెనక్కి పడేలా చేశాడు. ఆ తర్వాత మరింత స్పీడ్ సర్వీస్‌లతో విరుచుకుపడి వరుసగా రెండు ఏస్‌లతో సెట్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్ చివర్లో తియఫో తన సర్వీస్‌ను కాపాడుకునేందుకు 15 నిమిషాల పాటు 20 పాయింట్లు సుదీర్ఘంగా పోరాడాడు. చివరకు తన ఫోర్‌హ్యాండ్ షాట్‌ను నెట్‌కు కొట్టడంతో షెల్టన్ ఆ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అదే జోరుతో నాలుగో సెట్లో మ్యాచ్‌ను ముగించాడు. 2003 యూఎస్ ఓపెన్‌లో ఆండీ రోడిక్ టైటిల్ గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఏ అమెరికా ఆటగాడు గ్రాండ్‌స్లామ్ సాధించలేదు. జ్వెరెవ్‌పై గెలిస్తే 23 ఏండ్ల తర్వాత అమెరికాకు గ్రాండ్ స్లామ్ అందించిన ఆటగాడిగా షెల్టన్ రికార్డు సృష్టిస్తాడు.