పెద్దఅంబర్‌పేట, మార్చి 18: కలిసి కొన్న ఇంటిలో భాగం పంచమన్నందుకు అక్కను ముక్కలుగా నరికి చంపాడో యువకుడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లీలాదేవి (40), పప్పూరామ్ కుమావత్ అక్కా తమ్ముళ్లు. రాజస్థాన్‌కు చెందిన వీరు కొన్నేండ్లుగా బాటసింగారంలో ఉంటున్నారు. కిరాణా షాపు నడుపుతూ జీవిస్తున్నారు. లీలాదేవి భర్త పదేండ్ల కిందట చనిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కొంతకాలం క్రితం లీలాదేవి, పప్పూరామ్ కలిసి బాటసింగారంలో 120 గజాల స్థలంలో ఇంటిని కొనుగోలు చేశారు.
పప్పూరామ్ పేరిట రిజిస్టర్ అయిన ఆ ఇంటిలో తన వాటా ఇవ్వాలని లీలాదేవి తమ్ముడిని అడిగింది. అందుకు ఒప్పుకోని పప్పూరామ్.. అక్కను అడ్డుతొలగించి ఇంటిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇంటి పక్కనే ఉన్న రాకేశ్ కుమావత్, సునీల్‌కుమార్‌తో కలిసి లీలాదేవిని గత నెల 28న హత్య చేశారు. మృతదేహాన్ని అదే ఇంట్లోని బాత్రూమ్లో దాచిపెట్టారు. ఈ నెల 2న మృతదేహాన్ని కారులో మజీద్‌పూర్‌లోని పెద్దచెరువు వద్దకు తీసుకెళ్లి రంపంతో కాళ్లు, మొండేన్ని ముక్కలుగా చేశారు.
కాళ్లను చెరువులో, మొండేన్ని తూము వద్ద పడేసి వెళ్లిపోయారు. అనంతరం లీలాదేవి కనిపించడం లేదని పప్పూరామ్ ఈ నెల 8న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పప్పూరామ్పై అనుమానంతో బుధవారం తమదైన శైలిలో విచారించి ముగ్గురు నిందితులను అరెస్టుచేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు.