Delhi | ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. నిరాశ్రయులు నైట్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.
చలికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 209గా నమోదైంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 218గా, అశోక్ విహార్‌లో 227, ద్వారకాలో 250, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 218గా నమోదయ్యాయి. ఇక ఆయా నగర్లో 148, బురారీ క్రాసింగ్ వద్ద 187, ఛాందినీ చౌక్ ప్రాంతంలో 181, డీటీయూలో 165గా ఏక్యూఐ నమోదైనట్లు సీపీసీబీ తెలిపింది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
Sobhita Dhulipala | పెళ్లిలో అదిరిపోయేలా స్టెప్పులేసిన శోభిత.. వీడియో వైరల్.!
Arvind Kejriwal | అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆస్కారం లేదు.. ఒంటరిగానే పోటీ : కేజ్రీవాల్