చెన్నై: తమిళనాడు తిరుప్పరంకుండ్రంలోని కొండపై ఉన్న దీపథూన్ (Deepathoon) రాతి స్తంభం హిందువులకు సంబంధించినది కాదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జైన సన్యాసులు దీనిని వినియోగించినట్లు కోర్టుకు వెల్లడించింది. సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలోని దర్గా వద్ద ఉన్న ‘దీపథూన్’ రాతి స్తంభంపై వివాదం నెలకొనడంతో హిందూ మత, ధార్మిక దేవాదాయ శాఖ తరుఫున సీనియర్ న్యాయవాది ఎన్ జోతి శుక్రవారం కోర్టులో వాదనలు వినిపించారు. ‘దీపథూన్’ రాతి స్తంభం హిందువులకు చెందినది కాదని, కార్తీక దీపం వెలిగించడానికి ఉద్దేశించినది కాదని తెలిపారు. జనానికి దూరంగా కొండల్లో నివసించిన దిగంబర జైన సాధువులు రాత్రిపూట సమావేశం కావడం కోసం కాంతి వనరుగా దీనిని వినియోగించినట్లు చెప్పారు. పురావస్తు పండితుడు రాసిన పాత పుస్తకంలో ఈ విషయం ఉన్నట్లు వివరించారు.
కాగా, దీపథూన్ రాతి స్తంభం ఉన్న భూమి తమకు చెందినదని దర్గా తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 1920లో దర్గాకు ఆ భూమిని కేటాయించినట్లు చెప్పారు. అయితే ఆస్తిని అనుభవించడంలో దర్గా పదేపదే ఇబ్బందులు ఎదుర్కొంటోందని కోర్టుకు వివరించారు. ఈ భూమిపై కేవలం యాజమాన్య హక్కులు మాత్రమే ఉన్నాయని, మతపరమైన భావాలకు సంబంధించినది కాదన్నారు. ‘ఆలయ భక్తులు ఈ స్తంభాన్ని తమ ఆస్తిగా పేర్కొంటున్నారు. దర్గా భూమిని మేం కాపాడుకోవాలి’ అని ఆ న్యాయవాది వాదించారు.
మరోవైపు దీపథూన్ స్తంభంపై కార్తీక దీపోత్సం నిర్వహించాలని ఉత్తర్వు జారీ చేసిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్, దర్గా తరుఫున వాదనలు వినిపించేందుకు అనుమతించలేదని, విచారణ నుంచి తొలగించారని డివిజన్ బెంచ్‌కు ఆ న్యాయవాది తెలిపారు. అయితే ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఎంపీలు జస్టిస్ స్వామినాథన్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో దీపథూన్ను జైన సాధువులు వినియోగించారన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది.
Also Read:
Man Burnt Alive In Car | కారుకు నిప్పంటించి.. ఒక వ్యక్తిని సజీవ దహనం