బెంగళూరు: కొందరు స్నేహితులు ఒక హోటల్లో పార్టీ చేసుకున్నారు. వారి కేరింతలు, శబ్దాల హోరుపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రైడ్ చేశారు. భయాందోళన చెందిన ఒక యువతి పారిపోయేందుకు ప్రయత్నించింది. పైపు లైన్ ద్వారా కిందకు దిగుతుండగా జారి పడటంతో తీవ్రంగా గాయపడింది. (Woman Falls Escaping Hotel) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల యువతి, ఆమె ఏడుగురు స్నేహితులు శనివారం రాత్రి బ్రూక్‌ఫీల్డ్‌లోని సీ ఎస్టా లాడ్జ్‌లో మూడు రూమ్స్ బుక్ చేసుకున్నారు. అక్కడ పార్టీ జరుపుకున్నారు.
కాగా, వారి హంగామా, అరుపులు, కేరింతలు, శబ్దాలకు స్థానికులకు నిద్ర భంగమైంది. దీంతో పోలీస్ హైల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. ఆ గుంపును మందలించారు. అందులోని మగవారిని డబ్బులు డిమాండ్ చేశారు.
మరోవైపు పోలీసులను చూసి ఆ యువతి భయాందోళన చెందింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. నాల్గవ అంతస్తులోని బాల్కనీ నుంచి డ్రెయిన్ పైప్ ద్వారా కిందకు దిగుతుండగా జారి పడింది. చాలా ఎత్తు నుంచి పడటంతో తీవ్రంగా గాయపడింది. స్నేహితులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్తె స్నేహితులు, ఆ లాడ్జ్ సిబ్బంది, అక్కడకు వెళ్లిన పోలీస్ సిబ్బందిని ప్రశ్నించి ఏం జరిగిందో అన్నది సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరాడు.
కాగా, లాడ్జ్ యాజమాన్యం నిర్లక్ష్యం, తగిన భద్రతా చర్యలు లేకపోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ సిబ్బంది డబ్బు డిమాండ్ చేయడంపై కూడా విచారణ జరుపుతామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Worm Infested Rice | కర్ణాటక మధ్యాహ్న భోజనంలో పురుగులు.. విద్యార్థులు ఆందోళన
woman marries Krishna idol | కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన మహిళ.. ఎందుకంటే?