చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చేసే ప్రకటనలు ఎంతటి జుగుప్స, అసహ్యాన్ని కలిగిస్తాయో చెప్పడానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అధికారులు కూల్చిన ఇండ్ల శకలాలను చూస్తే అర్థమవుతున్నది. యుద్ధంలో బాంబులు పడితే చెల్లాచెదురై చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూస్తే ఎంతటి పాషాణ హృదయాలనైనా కరిగిస్తుంది. గత నెల 24న తెల్లవారుఝామున 6 గంటలకే ఉన్నపళంగా యుద్ధానికి వచ్చినట్టు వేల మంది పోలీసు బలగాలను వెంటపెట్టుకొని 50 బుల్డోజర్లతో అధికారులు రంగంలోకి దిగారు. ఇండ్లను నేలమట్టం చేసి ఈ ప్రభుత్వ పెద్దలు, అధికారులు తామేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నారు.
ఖమ్మం పట్టణ కేంద్రానికి ఆనుకుని ఉన్న వెలుగుమట్ల ప్రాంతంలో 147, 148, 149 సర్వే నంబర్లలోని భూమి భూదానోద్యమకర్త వినోబాభావే పిలుపుతో ఒకప్పటి భూస్వాములు ఇచ్చిన భూదాన భూములు . వివిధ రకాల పనులు చేస్తూ అద్దె ఇండ్లలో పనిచేస్తున్న పేదలకు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో 2014 జనవరిలో దరఖాస్తులు పెట్టడంతో భూదాన్ బోర్డు వారు ప్రొసీడింగ్స్ ఇచ్చి లేఔట్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ అమల్లోకి తెచ్చి అక్కడ నివాసం ఉండటానికి భూదాన్ బోర్డు నుంచి పత్రాలు పొందిన పేదలందరికీ నివాస హక్కులు ఇవ్వాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సుమారు 400 పేదలు కుటుంబాలు 2018లో అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అది క్రమంగా ఇపుడు 1,000 కుటుంబాల నివాసాల వరకు వెళ్లింది. తమ హక్కులను కాలరాయొద్దంటూ ఈ పేదలు చాలాసార్లు కోర్టు మెట్లెక్కడంతో అధికారులు జోక్యం చేసుకోవద్దని న్యాయస్థానం చెప్పింది. కానీ కోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో ఆ పేదలు అక్కడే నివాసం ఉంటూ పొట్టకూటికోసం పట్టణంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పేదల ఇండ్లను కూలకొట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండటానికి ఎవరికీ హక్కే లేదని అబద్ధాలు చెప్తున్నది. కానీ కనీస సౌకర్యాలు కల్పించాలని దరఖాస్తు చేసుకున్న 120 మందిలో 60 మందికి అధికారులు ఇంటి నంబర్లు ఎలా కేటాయించారు? మిగతా వారి ఇంటి నంబర్లు బ్లాకులో ఎందుకు ఉంచారు? ఈ వ్యవహారం జరిగిన వెంటనే కొంతమంది బాధితుల ఫోన్లకు ఇంటి పన్ను కట్టాలని సందేశాలు వచ్చాయి. అంటే అక్కడ నివాసం ఉన్న పేదలు నిబంధనల మేరకు హక్కును కలిగి ఉన్నట్టే కదా! ప్రభుత్వం కూలగొట్టిన ఇండ్ల పక్కనే ఎర్ర రంగుతో గుర్తులు వేసి, ఎవరూ అటు రావొద్దని చెప్పే ఇండ్లు కనపడుతాయి. కానీ ప్రభుత్వం స్థానికులను బలవంతంగా ఇండ్ల నుంచి వెళ్లగొట్టే కుట్ర చేసిందని అర్థమవుతున్నది. వెలుగుమట్ల ప్రజల జీవితాల్లో నాలుగు గంటల్లోనే చీకట్లు నింపిన రేవంత్ సర్కార్ తమది ప్రజా ప్రభుత్వం ఎట్లా గొప్పలు చెప్పుకుంటున్నదో.
పేదల ఇండ్లను కూల్చిన తర్వాత అర్హులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టిస్తామని ఆ ప్రాంత మంత్రి పత్రికల ముందు, టీవీ చానళ్ల ముందు ప్రకటించారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ ఉద్దేశమే ఉంటే అక్కడే సర్వే చేసి అర్హులైన వారిని ఉంచి మిగతావారిని చట్టప్రకారం వెళ్లగొట్టే అవకాశం లేకపోయిందా? అనేది పెద్ద ప్రశ్న. ఇండ్లను కూలగొట్టడంతో కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు. అసలు ఆ భూమి పేద ప్రజల ప్రయోజనాల కోసం ఇచ్చినది. దాన్ని వ్యాపారకోణంలో మార్చి మాట్లాడుతుంటేనే ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగా చేసిన చర్యగా కనపడుతున్నది.
కూల్చివేసిన ఇండ్లలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్నా, వారి పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం కూడా అధికారులు కల్పించలేదు. తమ పుస్తకాలన్నీ ఆ శిథిలాల్లో ఉండిపోయాయని, తామిప్పుడు పరీక్షలు రాయలేక ఫెయిల్ అవుతున్నామని, ఇక తమ భవిష్యత్తు ఏమి కావాలని కన్నీరు పెడుతూ ప్రశ్నిస్తుంటే అధికారులు, పాలకులు ఏం సమాధానం చెప్తారు?
వారిని పరీక్షలు రాయకుండా చేసి భవిష్యత్తు లో ఉన్నత విద్యను అభ్యసించే వీల్లేకుండా చేసిన ఈ ప్రభుత్వం వారి విద్యా హక్కును కాలరాసిన ట్టు కాదా? పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే పలువురు విద్యార్థులు చుట్టాల ఇండ్లలో తలదాచుకుంటున్నారు. వారి కండ్ల ముందే నేలమట్టమైన వారి ఇండ్ల కూల్చివేత దృశ్యం వారి మనసులను ఎంతగానో కలచివేస్తున్నది. ఇప్పు డు ఆ చిన్నారులు పరీక్షలమీద శ్రద్ధ పెట్టగలరా? ‘ఇక్కడ ఉన్న పాపానికి అధికారుల చర్యల వల్ల మా పిల్లలను కస్తూర్బా గురుకులంలో చేర్చుకోవడం కూడా కాలేదు సార్’ అంటూ కొంతమం ది తల్లిదండ్రులు బోరున విలపించారు. వారికి ఏ సమాధానం చెబుతుంది ఈ ప్రభుత్వం.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కును కల్పించింది. జీవించే హక్కు అంటే కేవలం గాలి పీల్చి బతకడం మాత్రమే కాదు. గౌరవప్రదంగా జీవించడమని చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ గౌరవప్రదమైన జీవితంలో ఆహారం, బట్టలు, నివాసం ఈ మూడు కూడా అవసరమని స్పష్టం చేసింది. ఓల్గా టెల్లిస్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేసులో, చమేలీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో కూడా రైట్ టు షెల్టర్ కూడా ఆర్టికల్ 21లో భాగమేనని స్పష్టం చేసింది. ఇక్కడ కూడు, గూడు, గుడ్డలను ధ్వంసం చేసి దేశ సర్వోత న్యాయస్థానం గౌరవప్రదమైన జీవనానికి ఇచ్చిన నిర్వచనాన్ని కూడా కాంగ్రెస్ పాలకులు ఖూనీ చేశారు.
ఆర్టికల్ 19 (1) (ఇ) ప్రకారం.. దేశంలోని ప్రతి పౌరుడికి ఎక్కడైనా నివసించే హక్కు కల్పించింది. మరి నివాసమే లేనప్పుడు ఆ పౌరుడు తానెక్కడ నివసించగలడు. నివాసం లేనివారికి నివాసం కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దుర్మార్గంగా ఇండ్లను భూముల రక్షణ పేరిట కూల్చివేయడం ప్రజల హక్కులను హరించినట్టుగానే భావించాల్సి వస్తున్నది.
యాదృచ్చికమో..కాకతాళీయమో తెలియదు గానీ.. ఇదే ఖమ్మం జిల్లా ముదిగొండలో 2007లో భూమి లేని పేదలకోసం భూములు ఇవ్వాలని ఉద్యమం చేస్తే కాల్పులు జరిపి జనం ప్రాణాలు తీసింది అప్పటి కాంగ్రెస్ సర్కార్. మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం 19 ఏండ్ల తర్వాత ఇపుడు భూదాన్ భూముల్లో నివాసముంటున్న పేదల ఇండ్లను దౌర్జన్యంగా కూలగొట్టి వారి బతుకు మీద దెబ్బకొట్టింది. అప్పుడు కూడా ప్రభుత్వ భూములను విలువైనవని చెప్పి వ్యాపారులకు కట్టబెట్టడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా పేదలకు దక్కాల్సిన భూములను కోట్ల విలువైన భూములంటూ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నదని అర్థమవుతున్నది. భూములకు ఆర్థిక పరిభాషనిచ్చి వ్యాపారులు, రియల్టర్ల కోసం పేదలను తరిమేసి తాము భూములను కాపాడుతున్నామంటే ‘గద్దలు కోడిపిల్లల కావలి కాస్తున్న’ కథలు చెప్పినట్టుగానే ఉంటుంది.
(వ్యాసకర్త: మానవ హక్కుల వేదిక ఉమ్మడి వరంగల్ ప్రధాన కార్యదర్శి)
– దిలీప్ వనపాకల
84640 30808