Pahalgam | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ఈ దాడిలో సుమారు 28 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్ (Pak Army chief) అసిమ్ మునీర్ (Asim Munir) చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రసంగం తర్వాతే పెహల్గామ్లో పర్యాటకులపై విచక్షణా రహితంగా దాడి జరగడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అదే సమయంలో పాక్ వాయుసేనకు చెందిన రవాణ, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేస్‌లకు తరలించడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కశ్మీర్ మా జీవనాడి..
కాగా, ఈనెల 17వ తేదీన ఇస్లామాబాద్‌లో ఓ కార్యక్రమంలో విదేశాల్లోని పాకిస్థానీయులను ఉద్దేశించి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మాట్లాడారు. 1947లో పాకిస్థాన్ పుట్టుకకు దారితీసిన రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆయన సమర్థించారు. జమ్ముకశ్మీర్‌పై కొనసాగుతున్న దీర్ఘకాల వైరాన్ని పునరుద్ఘాటించారు. కశ్మీర్ తమ జీవనాడి అని, దానిని మరిచిపోలేమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘మా వైఖరి సుస్పష్టం. కశ్మీర్ మా జీవనాడి. దానిని మరిచిపోలేం. కశ్మీర్ సోదరులను వారి వీరోచిత పోరాటంలో మేం వదిలేయలేం’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య విభేదాలనూ ఆయన ప్రస్తావించారు. ‘హిందువుల కంటే మనం భిన్నమని మన పూర్వీకులు నమ్ముతారు. మన మతం వేరు. మన ఆచారాలు వేరు. మన సంప్రదాయాలు వేరు. మన ఆలోచనలు వేరు. మన ఆశయాలు వేరు. రెండు దేశాల సిద్ధాంతానికి ఇదే పునాది. మనం ఒకటి కాదు రెండు దేశాలు అనే నమ్మకంతో ఇది ఏర్పడింది’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందిస్తూ విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుందని, ముందు పీవోకేను ఖాళీ చేయాలని బదులిచ్చింది.
Also Read..
Amit Shah | ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు : అమిత్ షా
Lashkar commander | పెహల్గామ్ నరమేధానికి ప్రధాన సూత్రధారి ఇతనే..!
Pahalgam | నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటో రిలీజ్.. బట్టబయలైన పాక్ కుట్ర..!