భోపాల్: అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు సర్పంచ్, అతడి అనుచరులు దళిత వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతడిపై మూత్ర విసర్జన చేశారు. (Dalit Man Urinated) దీంతో బాధిత దళిత వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13 సాయంత్రం గ్రామ సర్పంచ్ రామానుజ్ పాండే, అతడి సహచరుల పర్యవేక్షణలో రామ్గఢ కొండ నుంచి అక్రమంగా కంకర తవ్వారు. అయితే తన వ్యవసాయ భూమికి సమీపంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలను దళితుడైన 36 ఏళ్ల రాజ్‌కుమార్ చౌదరి కాట్ని వ్యతిరేకించాడు. దీంతో అతడ్ని కులపరంగా వారు దూషించారు. చంపుతామని బెదిరించారు.
కాగా, పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రాజ్‌కుమార్‌ను సర్పంచ్ రామానుజ్ పాండే, అతడి కుమారుడు పవన్ పాండే, మేనల్లుడు సతీష్ పాండే, ఇతర అనుచరులు అడ్డుకున్నారు. రాడ్లు, కర్రలతో అతడిపై దాడి చేశారు. తనను రక్షించేందుకు తల్లి ప్రయత్నించగా ఆమె జుట్టుపట్టుకుని కొట్టారని, సర్పంచ్ కుమారుడు తనపై మూత్ర విసర్జన చేసినట్లు రాజ్‌కుమార్ ఆరోపించాడు.
మరోవైపు దాడిలో గాయపడిన రాజ్‌కుమార్ చికిత్స పొందిన తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సీఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
అయితే ఈ ఆరోపణలను సర్పంచ్ రామానుజ్ పాండే ఖండించాడు. రాజకీయ ప్రేరేపితమని ఆరోపించాడు. ‘అక్రమ మైనింగ్ జరుగలేదు. మేం పంచాయతీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం. దానికి కంకర అవసరం. ఈ ఆరోపణలు అబద్ధం. నన్ను కించపరచడానికి ఉద్దేశించినవి’ అని తెలిపాడు.
Also Read:
Mamata Banerjee | సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ
Watch: బెంగళూరు మెట్రో ట్రైన్లో అడుక్కున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?