Covid-19 | కరోనా మహమ్మారి (Corona Virus) మరోసారి పంజా విసురుతున్నది. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 270కిపైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను (hospitals) అప్రమత్తం చేశాయి. తగినన్ని బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించాయి.
ఢిల్లీలో మూడేళ్ల తర్వాత తొలిసారి..
దేశ రాజధాని ఢిల్లీలో మూడేళ్ల తర్వాత తొలిసారి ఈ నెలలో 23 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజా వేరియెంట్ సాధారణ ఇన్ఫ్లు ఎంజా లాంటిది మాత్రమే అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఢిల్లీ – ఎన్సీఆర్ నగరాలైన నోయిడా, ఘజియాబాద్‌లోనూ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోయిడాలో ఇవాళ తొలి కరోనా కేసు నమోదైంది. 55 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ తేలింది. అటు ఘజియాబాద్‌లోనూ నాలుగు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
దేశంలోనే అత్యధికంగా కేరళ రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే ముఖానికి మాస్క్ ధరించాలన్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మరోవైపు కర్ణాటకలో కూడా కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ తేలిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. మహారాష్ట్ర ముంబైలోనూ 95 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Karnataka: మైనర్ అత్యాచారం కేసులో కర్నాటక మఠపూజారి అరెస్టు
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్‌కు షాక్.. నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
Monsoon | కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత తొలిసారి