భోపాల్: ఒక పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి వందకు పైగా కేసుల్లో సాక్షులుగా ఉన్నారు. ఆ పోలీస్ అధికారి బదిలీ అయిన పోలీస్ స్టేషన్ల కేసుల్లో కూడా వీరే సాక్షులు. (Cop’s Cook, Driver Turn Witness) ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పోలీస్ అధికారిపై చర్యలు చేపట్టారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మౌగంజ్ జిల్లాలోని ఇంద్రగర్హి, నైగర్హి పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా జగదీష్ సింగ్ ఠాకూర్ పని చేశారు. ఆయన వ్యక్తిగత డ్రైవర్ అమిత్ కుష్వాహా, పోలీస్ స్టేషన్లో వంట చేసే దినేష్ కుష్వాహా అనే కూరగాయల వ్యాపారి సుమారు 106 కేసుల్లో సాక్షులుగా లేదా సమాచారం అందించిన వ్యక్తులుగా ఉన్నారు.
కాగా, పోలీస్ అధికారి జగదీష్ సింగ్ ఠాకూర్ బదిలీ అయిన స్టేషన్లలో నమోదైన కేసుల్లో కూడా డ్రైవర్, వంట మనిషి కీలక సాక్షులుగా ఉన్నారు. డ్రైవర్ అమిత్ కుష్వాహా ఒక్కడే 18 కేసుల్లో ఏకైక సాక్షిగా పోలీస్ రికార్డుల్లో నమోదయ్యాడు. 2020లో అతడి వయస్సు 20గా, 2025లో నమోదైన ఒక కేసులో 21గా పేర్కొన్నారు. ఒక కేసులో అతడు ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు.
మరోవైపు నైగర్హి పోలీస్ స్టేషన్లో క్లీనర్‌గా పనిచేసే రమాకాంత్ యాదవ్, 14 కేసుల్లో సాక్షిగా ఉన్నాడు. పోలీస్ స్టేషన్ వాహనాన్ని నడిపే రాహుల్ విశ్వకర్మ పేరు 18 కేసులలో సాక్షిగా నమోదైంది. ఆ పోలీస్ స్టేషన్ సమీపంలో నివసించే వికలాంగుడైన అరుణ్ తివారీ కూడా అమిత్ కుష్వాహాతో కలిసి ఆరు కేసుల్లో సాక్షిగా ఉన్నాడు. అయితే ఆశ్చర్యకరంగా ఒక దోపిడీ కేసులో అరుణ్ తివారీ నిందితుడయ్యాడు. 2025 మే 19న నైగర్హి పోలీస్ స్టేషన్లో అతడిపై దోపిడీ కేసు నమోదైంది. ఆ సమయంలో తాను పట్టణంలో లేనని అతడు తెలిపాడు.
కాగా, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎస్ఎస్)లోని సమాచారం ఆధారంగా 2022 నుంచి 2025 మధ్య నమోదైన 500కు పైగా కేసుల్లో ఇలాంటి తప్పుడు సాక్షులు బయటపడ్డారు. నైగర్హితో సహా జగదీష్ సింగ్ ఠాకూర్ పనిచేసిన పోలీస్ స్టేషన్లలోని 150కు పైగా ఎఫ్ఐఆర్లు నకిలీవి లేదా తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు సామాజిక కార్యకర్త కుంజ్‌బిహారి తివారీ దీనిపై ఫిర్యాదు చేశారు. ‘150కు పైగా కేసుల్లో ఒకే వ్యక్తి సాక్షిగా ఉన్నాడు. అధికారులకు బదిలీ అయినట్లే, ఈ సాక్షి కూడా వారితో పాటు వెళ్లాడు. ఒకే రోజు ఐదు సంఘటనలు జరిగినప్పటికీ సాక్షి ఒకే వ్యక్తి ఉంటాడు. వారు ( పోలీస్ అధికారులు) సాక్షులను తమ జేబులో పెట్టుకుంటారు’ అని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
మౌగంజ్ ఎస్పీ దిలీప్ కుమార్ సోని దీనిపై స్పందించారు. పోలీస్ అధికారి జగదీష్ సింగ్ ఠాకూర్‌ను నైగర్హి పోలీస్ స్టేషన్ నుంచి తొలగించారు. ఆయనను పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. ఈ అంశంపై దర్యాప్తును సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్డిఓపీ)కి అప్పగించారు. వాస్తవాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సోని వెల్లడించారు.
Also Read:
Watch: పోలీస్ వాహనం ముందే బైక్ విన్యాసాలు.. పట్టించుకోని పోలీసులు
Tej Pratap Yadav | తల్లిదండ్రులు, తమ్ముడ్ని కలిసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎందుకంటే?
Girl Gang-Raped In Car | 12వ తరగతి విద్యార్థిని కిడ్నాప్.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం