న్యూఢిల్లీ, డిసెంబర్ 3: చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్ కేసులు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే తమ పౌరులకు బూస్టర్ డోస్ ఇస్తుండగా.. భారత్‌లోనూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ పరిశోధనకు ఏర్పాటు చేసిన జీనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియమ్ ‘ఇన్సాకాగ్’ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఇప్పటివరకూ టీకా వేసుకోని వారికి వ్యాక్సిన్‌ను వేయడంతో పాటు, అధిక ముప్పు పొంచి ఉన్న 40 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును ఇచ్చే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వల్ల ఏర్పడే యాంటిబాడీలు ఒమిక్రాన్ వంటి వేరియంట్లను తటస్థీకరించడానికి సరిపోయేలా కనిపించడం లేదని అభిప్రాయపడింది. అయినప్పటికీ, తీవ్రమైన వ్యాధిబారిన పడే అవకాశాలను ఈ టీకాలు తగ్గిస్తాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్ ఉనికిని త్వరగా తెలుసుకునేందుకు జన్యుపరమైన నిఘా అవసరమని సూచించారు.
బూస్టర్ డోసుపై త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ఆరు దవాఖానల్లో త్వరలో ఈ ట్రయల్స్ జరుపనున్నట్టు వెల్లడించింది. మరోవైపు, బూస్టర్ డోసుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేరళ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దేశీయ వ్యాక్సినేషన్లో విరివిగా వినియోగిస్తున్న కొవిషీల్డ్‌ను బూస్టర్ డోసుగా గుర్తించాలంటూ సీరం ఇన్స్టిట్యూట్.. భారత ఔషధ నియంత్రణ సంస్థకు ఇటీవలే దరఖాస్తు చేసుకుంది. దేశంలో కొత్త వేరియంట్ కలకలం, బూస్టర్ డోసుపై పలు వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో.. బూస్టర్ డోసు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుపై ‘ఇన్సాకాగ్’ సూచనలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.
కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వినియోగిస్తున్న ఏడు టీకాలు బూస్టర్ డోసులుగా వాడొచ్చని ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ జాబితాలో ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కొవిషీల్డ్), ఫైజర్, నొవావాక్స్, జాన్సన్, మోడెర్నా, వాల్నెవా, క్యూర్‌వాక్ టీకాలు ఉన్నాయి. గతంలో ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ టీకా రెండు డోసులు వేసుకున్న వారికి కూడా పై వ్యాక్సిన్లను బూస్టర్ డోసుగా వేయవచ్చని బ్రిటన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్ సౌతాంప్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ పరిశోధకులు తెలిపారు. 2,878 మందిపై ట్రయల్స్ జరిపామని, వలంటీర్లలో చెప్పుకోదగ్గ దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు.
గతంలో కరోనా వైరస్ సోకి కోలుకొన్నవారిపైన, ఇప్పటిదాకా వైరస్ సోకనివారిపైన.. ఒమిక్రాన్ ప్రభావం ఒకేలా ఉంటున్నది
–దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు