Pension | న్యూఢిల్లీ: చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయటపడింది. హారర్ చిత్రాన్ని తలపించే ఈ వ్యవహారం అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నది.
ఇటలీలోని బోర్గో వర్జీలియోలో నివసించే ఓ 56 ఏళ్ల మంటోవా గతంలో నర్సుగా పనిచేసేవాడు. స్థానిక రిజిస్ట్రీ కార్యాలయంలో తన తల్లి గ్రాజియెల్లా గుర్తింపు కార్డును రెన్యువల్ చేసేందుకు వెళ్లిన ప్రతిసారీ తన తల్లిలా కనిపించేందుకు తలకు విగ్గు, పెదవులకు లిప్స్టిక్, ముఖానికి మేకప్, 1970 దశకంలో ఉపయోగించే బ్లౌజు, పొడుగు స్కర్టు, నెయిల్ పాలిష్, పాతకాలం నాటి చెవిరింగులు ధరించేవాడు.
మూడేళ్ల క్రితం ఆ వ్యక్తి తల్లి డాల్ ఓగ్లియో మరణించగా ఆ విషయాన్ని వెల్లడించకుండా ప్రతినెలా ఆమె పింఛనును వసూలు చేసుకునేవాడు. అలా రూ.80 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా.. మమ్మీలా మార్చి ఇంట్లో భద్రపర్చాడు. అయితే పింఛను కోసం వచ్చిన వృద్ధురాలి రూపంలో ఏదో తేడా ఉన్నట్లు ముందుగా రిజిస్ట్రీ ఉద్యోగి గుర్తించాడు. ఆమె మెడ బలంగా ఉంది. ముఖంలో మడతలు వింతగా ఉన్నాయి. చేతులపైన చర్మం వృద్ధురాలి చర్మంలా లేదు. గొంతులో కొంత ఆడతనం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మగగొంతు వినిపించేది అని రిజిస్ట్రీ ఉద్యోగి చెప్పినట్లు బోర్గో వర్జీలియో మేయర్ ఫ్రాన్సెస్కో తెలిపారు. పింఛను ఫారాలు నింపాలని పిలిపించి తన తల్లి వేషంలో వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. తన నేరాన్ని అతను అంగీకరించినట్లు ఆయన తెలిపారు.