KTR | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డారు. కులగణన పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి, చివరకు బీసీ వర్గాలకు అన్యాయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో రూ.160 కోట్లను ఖర్చు చేసిందని కేటీఆర్ తెలిపారు. చివరకు పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు కేవలం 17 శాతం రిజర్వేషన్లనే కేటాయించిందని పేర్కొన్నారు. గతంలో బీసీలకు ఉన్న 24 శాతం కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కులగణన పేరిట ప్రజా ధనాన్ని వృథా చేసి, చివరకు బీసీ రిజర్వేషన్లను తగ్గించడానికి కాంగ్రెస్ నాయకత్వం ఏ జ్ఞానంతో పనిచేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ మోసంపై స్పందిస్తారా అని రాహుల్‌గాంధీని నిలదీశారు.

Bc Reservations
సుదీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలిన అనుభవం. రాజ్యాంగ మార్గదర్శకాలు.. సుప్రీంకోర్టు ఆంక్షలు.. అమల్లో ఉన్న చట్టాలు అన్నీ తెలుసు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను గుప్పించింది. అందులో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒకటి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన నిర్వహించి, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని వాగ్దానం చేసింది. హామీ అమలు కోసమైనా చిత్తశుద్ధితో కృషి చేసిందా? అంటే అదీ లేదు. కమిషన్ల నియామకం.. ఇంటింటి సర్వే.. నివేదికలు.. అసెంబ్లీలో బిల్లుల ఆమోదం.. ఆర్డినెన్స్, జీవోలు జారీ వరకూ ప్రభుత్వం వ్యవహరించిన తీరే అద్దం పడుతున్నది. ఒకసారి కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని, మరోసారి రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని, ఇంకోసారి ఆర్డినెన్స్ ద్వారా అమలుచేస్తామని, పార్టీపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, చివరకు పాతకోటా అంటూ పూటకో మాట చెప్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానరహిత, లోపభూయిష్ట మార్గదర్శకాల ఫలితంగా అనేక న్యాయపరమైన సవాళ్లు ఎదురవడమే కాదు, ఉన్న రిజర్వేషన్లే దక్కని ప్రమాదం వచ్చిపడిందని బీసీవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కులగణన పేరిట గారడీ
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సర్వే చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏడాదిపాటు ఆ ఊసే ఎత్తలేదు. కులగణనకు రూ.150 కోట్లు విడుదల చేస్తూ 2024 జనవరి 28న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల ఇంటింటి సర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరి 17న అసెంబ్లీ తీర్మానం చేసింది. పార్లమెంట్ ఎన్నికల ముందు బీసీ సంక్షేమ శాఖ ఇంటింటి సర్వేను నిర్వహిస్తుందని 2024 మార్చి 15న జీవో 26 జారీచేసింది. ఇంటింటి సర్వేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుందని పేర్కొంటూ 2024 అక్టోబర్ 10న జీవో-18 జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2024 నవంబర్ 6న ఇండ్ల గుర్తింపుతో ప్రారంభమైన ఇంటింటి సర్వే ప్రక్రియ అదే నెల 26వ తేదీ వరకు కొనసాగింది. ఆ తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో 2025 జనవరిలో క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటుచేసింది., ఫిబ్రవరి 2న క్యాబినెట్ సబ్‌కమిటీకి సర్వే నివేదికను ప్లానింగ్ విభాగం సమర్పించింది. 2025 ఫిబ్రవరి 4న అసెంబ్లీలో సర్వే స్థూల గణాంకాలను వెల్లడించడంతోపాటు ఆమోదం తెలిపింది. బీసీ కుల గణాంకాలు, తెలంగాణ జనాభా లెక్కలు తదితర అంశాలపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో 2025 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు రీ సర్వే నిర్వహించిన ప్రభుత్వం.. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ గణాంకాలను వెల్లడించింది తప్ప, కులాలు, ఉపకులాల వారీగా లెక్కలేవీ వెల్లడించలేదు. నివేదికను బహిర్గత పరచలేదు. అభ్యంతరాల స్వీకరణ చేపట్టనూ లేదు. ఇదీ రాజ్యాంగ విరుద్ధం.
నివేదికలన్నీ గోప్యం
సర్వే నివేదికలనే కాదు బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే ఇంటింటి సర్వే గణాంకాలను విశ్లేషించడానికి తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో 11 మంది సభ్యుల స్వతంత్ర నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసింది. తెలంగాణలో సామాజిక న్యాయం, కుల నిర్మాణాలపై పరిశోధనలు చేసిన నిపుణులు ఎందరోఉన్నా, వారందరినీ పకనపెట్టి ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టిని వర్కింగ్ గ్రూపు సభ్యుడిగా నియమించింది. ఈ వరింగ్ గ్రూప్ సర్వే డాటాను విశ్లేషించి నివేదికను సమర్పించింది. సర్కారు ఆ నివేదికనూ బహిర్గత పరచలేదు. పూర్తిగా గోప్యంగానే దాచిపెట్టింది.
అసెంబ్లీలో బిల్లులు.. ఢిల్లీలో ధర్నా డ్రామాలు
తుదకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2025 మార్చి 7న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా మార్చి 17న బిల్లు నంబర్ 3 ద్వారా విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను, మార్చి 17న బిల్లు నంబర్ 4 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచారు. ఆ రెండు బిల్లులను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. పక్షం రోజులు గడవక ముందే ఆ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ 2025 ఏప్రిల్ 2న ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. అయితే, ఈ ధర్నాలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే పాల్గొనలేదు.
అన్నీ తెలిసే ఆర్డినెన్స్
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా అమలుచేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది. మూడు నెలల వ్యవధిలోగా గవర్నర్ ఆమోదం చెప్పకపోతే బిల్లును ఆమోదించినట్టుగా పరిగణించాలని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని, అప్పటికీ లైవ్‌లో ఉన్న అసెంబ్లీని ప్రోరోగ్ చేయించి మరీ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. అయితే, నోటిఫై చేయకుండానే ఆర్డినెన్స్ జారీ చేసి ఉద్దేశపూర్వకంగా బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసం చేసింది. ఇక ఆర్డినెన్స్‌కు సైతం ఆమోదం లభించలేదు. అయినప్పటికీ, ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తాజాగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గత ఆగస్టులో మరోసారి అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసింది. గవర్నర్ ఆమోదం లేకుండా అమలు అసాధ్యమని తెలిసినా, ఆ వెంటనే జీవో-9ను విడుదల చేయడం కాంగ్రెస్ కుట్రలను తేటతెల్లం చేస్తున్నది.
జీవో-46తో రిజర్వేషన్లు మళ్లీ కుదింపు
జీవో-9 విడుదలతోపాటు ఆ మేరకు రిజర్వేషన్లను ఖరారు చేయడం, స్థానిక సంస్థల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించడం గమనార్హం. అయితే జీవో-9 అమలుపై హైకోర్టుతాత్కాలికంగా స్టే విధించింది. పూర్తిగా రద్దు చేయలేదు. ఆయా పిటిషన్లపై సోమవారం విచారణ కొనసాగాల్సి ఉండగా చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడింది. జీవో-9 అంశంపై ఎటూ తేలకముందే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జీవో-46 విడుదల చేసింది. మళ్లీ గతంలో మాదిరిగానే 50% రిజర్వేషన్ల పరిమితిని విధించింది. బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి పాతరేసింది.
హైకోర్టు మొట్టికాయలతో డెడికేటెడ్ కమిషన్
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్ల స్థిరీకరణకు బీసీ కమిషన్‌కు అధికారాల్లేవు. అందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందే. కానీ, ప్రభుత్వం ఆ నిబంధనలు తుంగలోతొక్కి రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను సైతం తెలంగాణ బీసీ కమిషన్‌కు అప్పగిస్తూ 2024 సెప్టెంబర్ 6న జీవో-199 జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడమే కాకుండా, డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని 2024 అక్టోబర్ 30న హైకోర్టు తీర్పుచెప్పింది. హైకోర్టు మొట్టికాయలతో కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరచింది. రిజర్వేషన్ల స్థిరీకరణకు బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో 2024 నవంబర్ 4న డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో-49ను జారీచేసింది. 2024 డిసెంబర్ 5 నుంచి జిల్లాల్లో డెడికెటేడ్ కమిషన్ బహిరంగ విచారణ జరిపింది. ఇంటింటి సర్వే గణాంకాలను డెడికేటెడ్ కమిషన్‌కు 2025 ఫిబ్రవరి 6న ప్రభుత్వం అందజేసింది. కమిషన్ 2025 ఫిబ్రవరి 27న నివేదిక సమర్పించింది. అయితే ఇంటింటి సర్వేకు సంబంధించి రీ సర్వే 2025 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు కొనసాగింది. ఆ గణాంకాలు లేకుండానే కమిషన్ నివేదికను సమర్పించడం కొసమెరుపు.