న్యూఢిల్లీ, నవంబర్ 25: కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోడ్లకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నాయి. ఈ లేబర్ కోడ్లు కార్మికులకు ఏమాత్రం ప్రయోజనకరం కావని స్పష్టం చేశాయి. పారిశ్రామిక సంబంధాల స్మృతి, 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు(ఓఎస్హెచ్) స్మృతి, 2020కి చెందిన కొన్ని నిబంధనలు కార్మిక వ్యతిరేకం. వీటిని రద్దు చేసి పునర్లిఖించాలిఅని హింద్ మజ్దూర్ సభ(హెచ్ఎంఎస్) ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ తెలిపారు. ఫ్యాక్టరీల మూసివేత, సమ్మె చేసే హక్కు, చిన్న యూనిట్లపై నియమ నిబంధనల భారాన్ని తగ్గించడం వంటివి కార్మికుల ప్రాణాలు, సామాజిక భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాము ప్రభుత్వానికి తెలియచేసినప్పటికీ తమ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా కార్మిక కోడ్లను ప్రభుత్వం అమలు చేసిందని హర్భజన్ సింగ్ చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తమ సభ్యులకు పిలుపునిచ్చిన 10 కార్మిక సంఘాలలో హెచ్ఎంఎస్ కూడా ఉంది. నిరుద్యోగ సంక్షోభం తీవ్రరూపం దాలుస్తూ నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కార్మిక చట్టాలను అమలుచేయడం శ్రామిక వర్గాలపై యుద్ధం ప్రకటించడమేనని 10 కార్మిక సంఘాలు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ చట్టాలను ఉపసంహరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అవి హెచ్చరించాయి. కాగా, కొన్ని కొన్ని సంఘాలు మాత్రం కాలం చెల్లిన చట్టాల స్థానంలో మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలు రావడాన్ని స్వాగతించాయి. కార్మిక చట్టాలలో తీసుకువచ్చిన సంస్కరణలను చారిత్రక మార్పుగా అభివర్ణిస్తూ బీఎంఎస్ సారథ్యంలో 14 కార్మిక సంఘాలు విడిగా ఓ ప్రకటనను నవంబర్ 22న విడుదల చేశాయి.