ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ ఆలయంలో ఉన్న కాళీమాత(Kali Mata) విగ్రహాన్ని.. మేరీ మాత డ్రెస్సుతో అలకరించారు. ఈ ఘటనలో పోలీసులు ఆ ఆలయ పూజారిని అరెస్టు చేశారు. ఆర్సీఎఫ్ పోలీసు స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు అయ్యింది. ముంబై శివారు ప్రాంతమైన చెంబూరులో ఉన్న ఓ గుడిలోని కాళీమాత విగ్రహానికి .. యేసు క్రీస్తు తల్లి మేరీ మాత దుస్తులను అలంకరించారు. దీనికి చెందిన వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆదివారం అమ్మవారి దర్శనానికి వెళ్లిన కాళీమాత భక్తులు ఖంగుతిన్నారు. మేరీ మాత అలంకారంలో అమ్మవారు కనిపించడంతో స్థానిక పోలీసుల్ని వారు ఆశ్రయించారు. దేవతామూర్తి డ్రెస్సును ఎలా మార్చారని ప్రశ్నించారు. అయితే ఆ ఆలయ పూజారి రమేశ్ ఆ ఆరోపణలపై స్పందించారు. కాళీ మాత తన కలలో కనిపించిందని, తనను మేరీ మాత రూపంలో అలంకరించాలని అమ్మవారు ఆదేశించిందన్నారు.
భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసును బుక్ చేశారు. మత విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసిన కేసులో పూజారిని అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. రెండు రోజుల పాటు పోలీసుల కస్టడీకి తీసుకెళ్లారు. ఏదైనా వ్యూహాం ప్రకారమే ఇలా చేశారా లేక దీంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.