Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ గత ఎన్నికల మేజిక్‌ను పునరావృతం చేస్తుందా లేక అసెంబ్లీ ఎన్నికల్లో అందలమెక్కిన కాంగ్రెస్ సత్తా చాటుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎగ్జాట్ పోల్స్‌లో ప్రతిబింబిస్తాయా అనే అంశంపైనా రాజకీయ పరిశీలకుల నుంచి ప్రజల వరకూ చర్చోపచర్చలు సాగాయి. ఇక ఎన్నికల ఫలితాలను చూస్తే కన్నడ నాట ఇరు జాతీయ పార్టీలూ సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేదనే చెప్పాలి.
గత లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో 28 స్ధానాలకు గాను బీజేపీ 26 స్ధానాల్లో విజయం సాధించింది. ఈసారి అదే మేజిక్‌ను రిపీట్ చేస్తామని కాషాయ పార్టీ బలంగా విశ్వసించింది. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతల సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ సర్కార్‌ను కూలదోసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కర్నాటకలో బీజేపీని దీటుగా నిలువరించేందుకు ప్రణాళికలకు పదునుపెట్టింది.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నుంచి ఆ పార్టీ అగ్రనేతల ప్రచారంతో పాటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ప్రత్యేక ఫోకస్‌తో ప్రచారం నుంచీ అన్నీ ముందుండి నడిపించారు. ఇంత చేసినా కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్ధానాలనే దక్కించుకునే దిశగా ఆధిక్యంలో సాగుతుండగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 26 స్ధానాలను గెలుచుకున్న బీజేపీ మిత్రపక్షం జేడీఎస్‌తో కలిసి 19 స్ధానాలనే తమ ఖాతాలో వేసుకోనున్నాయి.
దక్షిణాదిలో ప్రధానంగా కర్నాటకలో తన ప్రాభవాన్ని నిలుపుకోవాలని కాషాయ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసిన కాంగ్రెస్ సైతం తన పట్టు నిలుపుకునేందుకు చెమటోడ్చినా రెండంకెల సీట్లు కూడా దక్కలేదు. కర్నాటకలో రెండు జాతీయ పార్టీలూ తమ అంచనాలకు అనుగుణంగా సీట్లు సాధించలేకపోయాయి.
Read More :