Chief Justice | ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాలపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) స్పందించారు. ఉత్తర్వులను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల కాటు వల్ల రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా పిల్లలు దీనికి గురవుతుండడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 5,000 వీధి కుక్కల కోసం 6 నుంచి 8 వారాలలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ ఆదేశాలకు అవరోధాలు కల్పించడానికి వ్యక్తులు కాని, సంస్థలు కాని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని కూడా ధర్మాసనం హెచ్చరించింది. వీధి కుక్కలను పట్టుకోవడానికి వచ్చే సిబ్బందిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అయితే ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు అమానవీయంగా ఉన్నాయని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలపై పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యతిరేకించిన రాహుల్ గాంధీ దశాబ్దాల మానవీయ, సైన్స్ మద్దతు ఉన్న విధానాన్ని తిప్పికొట్టడంగా దీనిని అభివర్ణించారు. ఇటువంటి ఆదేశాలు చాలా క్రూరమైనవని, దూరదృష్టి లేనివని, పైగా ఇవి మనలోని మానవత్వాన్ని దూరం చేస్తాయని ఆయన విమర్శించారు. మూగజీవాలతో మనకు ఎంతమాత్రం సమస్య లేదని, వాటిని నిర్మూలించాలనడం సబబు కాదని ఆయన అన్నారు. మరోవైపు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఆదేశాలను సమీక్షించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖలు కూడా రాశారు.
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కల కారణంగా పలువురు, ముఖ్యంగా చిన్నారులు కుక్క కాట్లకు గురవుతున్నారని, రేబిస్ వ్యాధి బారిన పడుతున్నందున వాటిని సాధ్యమైనంత త్వరగా షెల్టర్ కేంద్రాలకు తరలించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పెటా సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆచరణీయం కానిది, అశాస్త్రీయమైనది, చట్టవిరుద్ధమైనదిగా పేర్కొంది. వీధి కుక్కల తొలగింపు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని, ఇది ఆచరణీయం కూడా కాదని కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ విమర్శించారు. ఈ తీర్పు తమను షాకింగ్‌కు గురి చేసిందని, ఇది అంతర్జాతీయ ప్రజారోగ్య మార్గదర్శకాలకు, భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటక్షన్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఏపీఓ) విమర్శించింది.
Also Read..
Supreme Court | వీధి కుక్కలకు షెల్టర్లు ఎక్కడున్నాయి.. చర్చనీయాంశమైన సుప్రీంకోర్టు ఆర్డర్