Supreme Court | ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధికుక్కలను హెల్టర్ హోమ్స్‌కు పంపాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు నిర్ణయంపై బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. వీధికుక్కల అంశంపై ఆదేశాలను సవరించాలని కోరుతూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి లేఖ రాశారు. అదే సమయంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సైతం కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెటా డైరెక్టర్‌గా ఉన్న జాన్ అబ్రహం కుక్కలన్నీ వీధికుక్కలు కావని.. సమాజంలో భాగమని, వాటిని చాలామంద్రి ప్రేమిస్తారన్నారు.
వాటిని చాలామంది, ముఖ్యంగా ఢిల్లీ వాసులు ప్రేమించే కమ్యూనిటీ కుక్కలుగా అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో జాన్ పేర్కొన్నారు. కోర్టు తాజా ఉత్తర్వులు.. జంతు జనన నియంత్రణ (ABC) నియమాలు-2023, ఈ అంశంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన నిర్ణయాలకు విరుద్ధంగా పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కలను తొలగించడం వల్ల సమస్య పరిష్కారం కాదని.. ఈ నిర్ణయాన్ని సమీక్షించి, సవరించాలని కోరారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, నటుడు వరుణ్ ధావన్ సుప్రీం ఉత్తర్వులు అన్యాయంగా పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది. వీధికుక్కలు సమాజంలో భాగంగా పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం టీ స్టాల్ బయట బిస్కెట్ల కోసం వేచి ఉండే, రాత్రంతా దుకాణాలకు కాపలాగా ఉండే.. పిల్లలు పాఠశాల నుంచి వచ్చే సమయంలో తోకలు ఊపుతూ స్వాగతించే ఈ కుక్కలేనని పేర్కొన్నారు.
Janhvi Kapoor Post
ప్రతి సమస్యకు పరిష్కారం జైలు శిక్ష కాదని.. వీధికుక్కలను షెల్టర్లలో ఉంచడం ఆచరణాత్మక పరిష్కారం కాదని.. నైతికమైంది కాదని పేర్కొన్నారు. బదులుగా పెద్ద ఎత్తున స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, క్యూనిటీ ఫీడింగ్ జోన్లు, అడాప్టింగ్ క్యాంపెన్ వంటి చర్యలు తీసుకోవాలని కోరింది. వరుణ్ ధావన్ ఇన్‌స్టా సోర్టీలో సుప్రీం నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. వరుణ్ చాలా సంవత్సరాలు పలు జంతువులను పెంచుకుంటున్నాడు. గతంలోనూ జంతువుల హక్కుల కోసం గళం విప్పాడు. రవీనా టాండన్ సుప్రీం నిర్ణయంపై స్పందించింది. స్థానిక సంస్థలు టీకాలు వేయడం, స్టెరిలైజేషన్ క్యాంపెన్ సరిగ్గా చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని పేర్కొన్నారు.
Varun Dhawan Post
ప్రజల భద్రత, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడుల ఘటనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం వీధికుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని.. తరలింపును అడ్డుకునే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాలని కూడా కోర్టు ఆదేశించింది. కుక్క కాట్లు, రేబిస్ మరణాలు పెరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసును సుమోటోగా తీసుకొని విచారించిన కోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పిల్లలు, శిశువుల భద్రత అత్యంత కీలకమైందని.. కొందరు తమను తాము జంతు ప్రేమికులుగా పిలుచుకున్నంత మాత్రాన వారి భద్రతను ప్రమాదంలో పడేయలేమన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు జంతు ప్రేమికులు, సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.