న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న అన్ని వీధి కుక్కలను ఆవాస కేంద్రాలకు తరలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నుంచి మేనకా గాంధీ వరకు చాలామంది రాజకీయ నేతలు, బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలు, నిపుణులు, హక్కుల కార్యకర్తలు, జంతు ప్రేమికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యతిరేకించిన రాహుల్ గాంధీ దశాబ్దాల మానవీయ, సైన్స్ మద్దతు ఉన్న విధానాన్ని తిప్పికొట్టడంగా దీనిని అభివర్ణించారు. ఇటువంటి ఆదేశాలు చాలా క్రూరమైనవని, దూరదృష్టి లేనివని, పైగా ఇవి మనలోని మానవత్వాన్ని దూరం చేస్తాయని ఆయన విమర్శించారు. మూగజీవాలతో మనకు ఎంతమాత్రం సమస్య లేదని, వాటిని నిర్మూలించాలనడం సబబు కాదని ఆయన అన్నారు.
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కల కారణంగా పలువురు, ముఖ్యంగా చిన్నారులు కుక్క కాట్లకు గురవుతున్నారని, రేబిస్ వ్యాధి బారిన పడుతున్నందున వాటిని సాధ్యమైనంత త్వరగా షెల్టర్ కేంద్రాలకు తరలించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పెటా సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆచరణీయం కానిది, అశాస్త్రీయమైనది, చట్టవిరుద్ధమైనదిగా పేర్కొంది. వీధి కుక్కల తొలగింపు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని, అంతేకాకుండా ర్థికంగా ఇది ఆచరణీయం కూడా కాదని కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ విమర్శించారు. ఈ తీర్పు తమను షాకింగ్‌కు గురి చేసిందని, ఇది అంతర్జాతీయ ప్రజారోగ్య మార్గదర్శకాలకు, భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటక్షన్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఏపీఓ) విమర్శించింది.
సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను సమీక్షించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు నటుడు జాన్ అబ్రహం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాస్తూ ‘అవి దొంగలు కావు.. సమాజ కుక్కలని అని మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. తరతరాలుగా మానవులకు పొరుగు వారిగా అవి జీవిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని నటులు వరుణ్ ధావన్, అడవి శేషు, నటీమణులు జాహ్నవీ కపూర్, సాన్యా మల్హో త్రాలు వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు వాటికి మరణ శిక్ష లాంటిదని వ్యాఖ్యానించారు.