PM Modi : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను మన క్షిపణి వ్యవస్థలు ధ్వంసం చేశాయన్నారు. బ్రహ్మోస్ క్షిపణులు.. శత్రువులకు నిద్రలేని రాత్రులే మిగిల్చాయని గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పుర్ సభలో మాట్లాడిన మోదీ.. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత సైన్యం పనితీరుపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ‘ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. స్వదేశీ ఆయుధ సామర్థ్యం, మేకిన్ ఇండియా శక్తిని ఇది ప్రపంచానికి చూపించింది. పాకిస్థాన్లో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రస్థావరాలను నాశనం చేశాం. భారత ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు దాయాది భూభాగంలోకి చొచ్చుకెళ్లి శత్రువులను గడగడలాడించాయి.’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
కాన్పూర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఆయన.. అమేథీలో ఏకే203 రైఫిల్ ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. భారత సైన్యం దాడులకు దిగివచ్చిన పాకిస్థాన్.. యుద్ధాన్ని ముగించాలంటూ వేడుకుందని ప్రధాని తెలిపారు. అణ్వాయుధ బెదిరింపులకు భారత్ భయపడదని, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోదని అన్నారు. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు ఇక పనిచేయవని స్పష్టంచేశారు.
ప్రతి ఉగ్రదాడికి తగిన సమాధానం చెప్పడమే భారత్ సిద్ధాంతమన్నారు. అందుకు సమయం, అనుసరించే విధానాన్ని సాయుధ బలగాలే నిర్ణయిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.