Monsoon Session | పహల్గాం ఉగ్రదాడి, ఓటర్ల జాబితా సవరణ (Bihar Voter List Revision) అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. సమావేశాలు ప్రారంభమైన వరుసగా మూడోరోజైన బుధవారం కూడా ఉభయసభలు అట్టుడికాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఎగువ సభ, దిగువ సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి.
ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలవగానే.. బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు. ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంతో కలిసి కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. తీరా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిందని వారు విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణతోపాటు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు డిమాండ్ చేశారు. దీంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఇండియా కూటమి ఎంపీల ఆందోళనలతో సభా కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. సభ్యులు ఎంతకూ తగ్గకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ రేపటి వాయిదా పడ్డాయి. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయి.
Rajya Sabha adjourned till 11 am on 24th July. https://t.co/oOiRmgGRbG
— ANI (@ANI) July 23, 2025
జూలై 29 నుంచి ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్లో చర్చ
పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. భారతీయ సైనిక దళాలు .. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉన్న 9 ఉగ్రస్థావరాలను ఆ ఆపరేషన్ సమయంలో నేలమట్టం చేశారు. అయితే ఆ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ రెఢీ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చించనున్నారు. జూలై 29వ తేదీన ఆ చర్చ జరగనున్నది. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చించేందుకు సమయాన్ని కేటాయించినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది.
Also Read..