Manish Sisodia | భారతీయ జనతాపార్టీ (BJP)పై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవి (Chief Minister post) ఆఫర్ చేసిందని ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓ జాతీయ మీడియాతో సిసోడియా మాట్లాడుతూ.. జైల్లో తాను ఇబ్బందులు పడుతున్న విషయం బీజేపీకి అర్థమైందన్నారు. దానికి తోడు తన భార్య అనారోగ్యం బారినపడటం, కుమారుడు చదువుకుంటున్నాడని తెలిసి వాళ్లు తనకు బీజేపీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. అలా చేస్తే ఆప్ కూటమిని విచ్ఛిన్నం చేస్తామని, ఆ తర్వాత తనను సీఎంను చేస్తామని బీజేపీ నేతలు చెప్పినట్లు సిసోడియా వివరించారు. దీనికి అంగీకరించకుంటే సుదీర్ఘకాలంపాటు జైల్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ‘కేజ్రీవాల్‌ను వదిలెయ్.. లేదంటే జైల్లోనే మగ్గిపో..’ అంటూ అల్టిమేటం జారీ చేశారని సిసోడియా ఆరోపించారు.
ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ విధానమని ఈ సందర్భంగా సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో వారికి ఎటాంటి పట్టింపులూ ఉండవని వ్యాఖ్యానించారు. కేవలం అధికారం కోసమే ఆరాటపడుతున్నారన్నారు. వారి మాట వినకుంటే తప్పుడు కేసులతో జైలుకు పంపుతారని దుయ్యబట్టారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా 2023లో అరెస్టైన విషయం తెలిసిందే. దాదాపు 17 నెలల పాటు ఆయన తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది. గతేడాది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇక వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సిసోడియా జాంగ్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు.
Also Read..
Maha Kumbh | కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు
FIITJEE Coaching Centers: యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత
Hindu Code of Conduct | హిందువులకు కొత్త ప్రవర్తనా నియమావళి.. అందులో ఏం ఉందంటే?