న్యూఢిల్లీ: యూపీ, ఢిల్లీల్లోని ఫిట్జ్ కోచింగ్ కేంద్రాల(FIITJEE Coaching Centers)ను అకస్మాత్తుగా మూసివేశారు. వారం రోజుల నుంచి ఆ సెంటర్లు పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో.. ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. జీతాలు ఇవ్వకపోవడం వల్లే అనేక మంది టీచర్లు సంస్థను వీడుతున్నట్లు తేలింది.
నోయిడా, ఘజియాబాద్, భోపాల్, వారణాసి, ఢిల్లీ, పాట్నాలో ఉన్న ఫిట్జ్(ఎఫ్ఐఐటీజేఈఈ) కోచింగ్ సెంటర్లను మూసివేశారు. యూపీలోని మీరట్లో ఉన్న సెంటర్ను కూడా తాజాగా క్లోజ్ చేశారు. నోయిడా నుంచి టీచర్లను రప్పించే ప్రయత్నం చేసినా.. కొన్ని రోజులు మాత్రమే ఇన్స్టిట్యూట్ నడిచింది. విద్యార్థుల తల్లితండ్రులు పోలీసు ఫిర్యాదులు నమోదు చేశారు. కోచింగ్ సంస్థ ఎటువంటి నోటీసు కానీ రిఫండ్ కానీ ఇవ్వలేదని పేరెంట్స్ తెలిపారు. మూసివేసిన బ్రాంచీల వద్ద పేరెంట్స్ నిరసన చేపట్టారు.
చాలా నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, అందుకే ఫ్యాకల్టీ సభ్యులు సంస్థలను వీడి వెళ్తున్నారని ఓ ఫిట్జ్ టీచర్ తెలిపారు. ఫిట్జ్లో ఆర్థిక సంక్షోభం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ సంస్థ బ్రాంచీలపై ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. లైసెన్సులు లేవని, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఫిట్జ్ సంస్థను 1992లో డీకే గోయల్ స్థాపించారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఆయన మెకానికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఇస్తారు. దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 72 ఫిట్జ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారు.