ప్రయాగ్రాజ్: హిందువులు పాటించాల్సిన ఆచార వ్యవహారాలు, పాటించాల్సిన ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ఒక ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతున్నది. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న క్రమంలో కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ కొత్త హిందూ ప్రవర్తనా నియమావళిని సనాతన ధర్మాన్ని పాటించే వారు చేయాల్సినవి, చేయకూడనివి పొందురిచారు.
300 పేజీలున్న ఈ నియమావళిలోని అంశాలను విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నుంచి జరిగే సమావేశంలో రుషులు, స్వాములు, మతపెద్దలతో చర్చిస్తారు. సాధువులు సహా శంకరాచార్యులు ధ్రువీకరించిన తర్వాత వేలాదిగా ముద్రించిన ప్రతులను మహాకుంభమేళాలో భక్తులకు పంపిణీ చేస్తారు.
కొత్త హిందూ ప్రవర్తనా నియమావళి రాత్రిపూట జరిగే వివాహాల కన్నా సూర్యుని సమక్షంలో పగటిపూట పెండ్లిండ్లు చేసుకోవాలని సూచిస్తుందని, అలాగే ఆడ శిశు హత్యలను, మహిళల నుంచి కట్నం స్వీకరించడాన్ని వ్యతిరేకిస్తుందని సమితికి చెందిన నేత ఒకరు తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలని, వారు యజ్ఞ, యాగాదులు వంటివి చేయడానికి అర్హులేనని, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తుందని, అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతుందని ఆయన చెప్పారు.