BJP President : బీజేపీ (BJP) నూతన అధ్యక్షుడి (New president) ఎంపికకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు కారణాలతో అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యమైంది. కాబట్టి బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తేదీ ప్రకటనకు ముందే నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని యోచిస్తోంది. ఆ మేరకు త్వరలో అధికారికంగా ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పార్టీ అగ్రనాయకుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత నూతన సారథి ఎంపికపై బీజేపీ వేగం పెంచనుందని, ఈ ఎంపికకు సంబంధించి ఇప్పటికే కొంతమంది వ్యక్తుల పేర్లను పార్టీ అధినేతలు పరిశీలించినట్లు సమాచారం. ఈసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అందులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురందేశ్వరీతోపాటు పలువురి పేర్లు వినిపించాయి.
బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సామాజిక సమీకరణాలను కాకుండా పార్టీని బలోపేతం చేయగలిగే నాయకుడిని ఎన్నుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతుంటాయి. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన రెండో టర్మ్ 2024 జూన్‌తో ముగిసినప్పటికీ.. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక చేపట్టాలంటే 50 శాతం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావడం తప్పనిసరి. దీనికి ముందు బూత్, మండల, జిల్లా స్థాయిలకు ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు ఉండటంతో జాప్యం జరిగింది.