Alia Bhatt Warning | తన కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంపై సీరియస్ అయ్యింది బాలీవుడ్ నటి ఆలియా భట్. ఈ విషయంపై తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇలాంటి పనులు తమ గోపత్యకు భంగం కలిగించడమే కాకుండా.. భద్రత సమస్యలను సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
ఇటీవలే ఆలియాభట్ – రణ్‌బీర్ కపూర్ జంట కలిసి ముంబైలో కొత్తగా ఒక ఇల్లు కట్టుకుంటుంది. ఈ ఇల్లు దాదాపు రూ.250 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ భవనంకి సంబంధించిన వీడియోలు ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో పలు న్యూస్ ఛానల్స్ కూడా ఆ విజువల్స్‌ని ప్రచురించాయి. అయితే ఈ విషయంపై సీరియస్ అయిన ఆలియా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
”ముంబై వంటి మహానగరంలో నివాసాలు చాలా దగ్గరిగా ఉండటం వలన ఒకరి ఇంటి నుంచి మరొకరి ఇంటిని చూడడం సహజమే. కానీ ఇలా ఉండడం వలన ప్రైవేట్ ఇళ్లను వీడియోలు తీసి ఆన్లైన్లో పెట్టే హక్కు ఎవరికీ లేదు. అనుమతి లేకుండా ఒకరి ప్రైవేట్ స్థలాలను వీడియోలు తీయడం అనేది కేవలం ‘కంటెంట్’ కాదు, అది ఒకరి గోప్యతను ఉల్లంఘించడమే అని ఆలియా భట్ తెలిపారు. అలాగే ఈ ఘటనపై ఆలియా తన భాదను వ్యక్తం చేస్తూ.. మీడియా సంస్థలకు, తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేసింది. మీ ఇంటిలోపల నుంచి వీడియోలు తీసి మీకు తెలియకుండా బయటపెడితే మీరు ఒప్పుకుంటారా? మనలో ఎవరూ ఒప్పుకోరు కదా అంటూ ఆలియా అభిమానులను ప్రశ్నించింది. అలాగే తన ఇంటి వీడియోలు ఫోటోలు ఆన్లైన్లో కనిపిస్తే దయచేసి వాటిని ఫార్వార్డ్ చేయొద్దని, షేర్ చేయొద్దని అభిమానులను కోరింది. మరోవైపు తన ఇంటి వీడియోలను ప్రచూరించిన మీడియా సంస్థలు వెంటనే వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేసింది.